నాగార్జున సాగర్‌లో కామ్రేడ్ల దారేటు !

నాగార్జున సాగర్‌లో కామ్రేడ్ల దారేటు !

తెలంగాణలో కామ్రేడ్ లకు అసలు కాలం  కలిసి రావడం లేదు. తాము అభ్యర్థిని నిలబెట్టినా లేక  మద్దతు ఇచ్చిన వారికి కూడా పరువు నిలబడటం లేదు. ఇప్పుడు నాగార్జున సాగర్ ఎన్నికలో మద్దతు అడిగిన కాంగ్రెస్ కి జై కొట్టలా..! వద్దా..? అనే మీమాంసలో పడ్డారు కామ్రేడ్ లు. 

తెలంగాణలో సీపిఐ, సీపీఎం పార్టీలు అసెంబ్లీలో ప్రాధాన్యత లేకుండా పోయాయి. తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లా ప్రజలు ఎర్ర జెండాకు అండగా నిలబడేవారు. అసెంబ్లీకి ప్రాతినిధ్యం కూడా ఇక్కడి నుండే ఉండేది. కానీ... తెలంగాణ ఏర్పాటు తర్వాత కామ్రేడ్ లు... రాజకీయంగా దెబ్బతిన్నారు. జై తెలంగాణ అని జెండా ఎత్తిన సీపీఐ పరిస్థితి అంతే ఉంది... సమైక్య వాదం పలికిన సీపీఎంది కూడా అలాంటి పరిస్థితే. సాధారణ ఎన్నికల్లో సీపీఐ మహాకూటమితో జట్టు కట్టినా... సీపీఎం బిఎల్ఎఫ్ పెట్టినా... ఒక్క సీటు కూడా నెగ్గలేక పోయారు. ఇటీవల జరిగిన mlc ఎన్నికల్లో సీపీ ఐ... సీపీఎం ఉమ్మడి అభ్యర్థిగా జయ సారథిని బరిలో దింపారు. అనుకున్న దానికంటే తక్కువే ఓట్లు సంపాదించారు. ఇక మద్దతు ఇచ్చిన ప్రో. నాగేశ్వర్ కూడా విజయానికి ఆమడ దూరం నిలిచారు. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వండని కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులను కోరింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడ చేసింది.

కాంగ్రెస్ విజ్ఞప్తిపై ఇప్పటి వరకు కామ్రేడ్ లు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. పోటీ చేస్తే గెలవలేక పోతున్నాం... మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా గెలవడం లేదన్న బాధ కామ్రేడ్ లలో ఎక్కువైంది. దీనికి తోడు... ఇన్నాళ్లు పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటే.. దాన్ని క్షేత్ర స్థాయి కేడర్‌ పాటించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదనే భావన ఉంది. ఇలా జరగడానికి పార్టీ తప్పిదాలు కూడా ఒక కారణమే. కొన్ని ఎన్నికల్లో ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోండని.. చెప్పిన రోజులు ఉన్నాయి. దీంతో కో ఆర్డినేషన్ దెబ్బతింది. ఇప్పుడు సాగర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో తేల్చాలని చూస్తున్నాయి.

ఒకప్పుడు కామ్రేడ్ లు వెంట ఉంటే అదో బలం..నమ్మకం ఉండేది. కానీ కమ్యూనిస్టులు ఇప్పుడు క్లారిటీ కి రాలేక పోతున్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య పోటా పోటీగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో హస్తంపార్టీ మద్దకు కోసం అభ్యర్ధిస్తోంది. అయితే అధికార పార్టీ ముందు కాంగ్రెస్ ఏ మేరకు నిలబడుతుంది అనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు లెఫ్ట్‌ పార్టీల నేతలు. మండలాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. తెలంగాణ లో కామ్రేడ్ లు రాజకీయాల ను శాసించే స్థాయి నుండి... మద్దతు ఇవ్వడం కోసం కూడా మల్లగుల్లాలు పడే వరకు వెళ్లారనే చర్చ జరుగుతోంది. ఎర్రజెండా ఎటు తిరుగుతుందా అనేది చూడాలి మరి.