ఒక్కడిగా మొదలుపెట్టి కోట్లమందిని కదిలించిన కెరటం

ఒక్కడిగా మొదలుపెట్టి కోట్లమందిని కదిలించిన కెరటం

రాష్ట్ర రాజకీయ చరిత్రను టీఆర్ఎస్‌  ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని విభజన రేఖ గీసిన ఘనుడు కేసీఆర్‌. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేందుకు దశాబ్దం కిందట టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన కేసీఆర్‌... పార్టీయే ఆయుధంగా ఉద్యమ బాట పట్టారు. నాడు తొలి అడుగుతో మొదలైన ప్రయాణం నేటికీ   తెలంగాణ సాధన కోసం అప్రతిహతగా సాగిపోతూనే ఉంది. ప్రత్యర్థుల ఊహలకు కూడా అందని వ్యూహాలతో దూసుకుపోతున్నారు గులాబీ దళపతి.  తెలంగాణ... ఈ ఒక్క మాటతోనే దశాబ్ద కాలంగా జనం సెంటిమెంట్‌ను ఒడిసిపట్టిన నేత ఎవరు అని అడిగితే అప్రయత్నంగా వచ్చే పేరు కేసీఆర్‌. తెలంగాణ సెంటిమెంట్‌తో కోట్ల మందిని ఉద్యమం వైపు నడిపిన నాయకుడు.. తెలంగాణ సాధన ఉద్యమంలో పదేళ్లగా పట్టువదలని విక్రమార్కుడు కేసీఆర్‌. దశాబ్దం కిందట టీఆర్‌ఎస్ ను స్థాపించిన కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణకు కర్త, కర్మ, క్రియగా ఎదిగారు. ఇప్పుడు కేసీఆర్‌ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే కేసీఆర్‌ అన్నంతగా మారిపోయింది పరిస్థితి. పదేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ వనంలో విరిసిన గులాబీ.. ఇప్పటీకి వసివాడకుండా... పస తగ్గకుండా ఉద్యమ పరిమళాలు వెదజల్లుతోందంటే దానికి కారణం కేసీఆరే. తెలంగాణ వాదమే జీవనాడిగా.. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ  దినదిన ప్రవర్థమానమవుతూ వస్తోందంటే దానికి కారణం కేసీఆరే.

ఒక్కరక్తపు బొట్టు చిందకుండా... ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత గులాబీ దళపతి కేసీఆర్‌దే. ఉద్యమం అంటే.. ఓ పది మందిని నడిపించడం కాదు. యావజ్జాతిని మేల్కొపడం. అదీ ఒక్క రక్తపు చుక్కా చిందకుండా... తన ఆశయ సాధనకు ప్రజలందరినీ సమాయత్తయం చేయడం. ఎన్నో ఉద్యమాలు చరిత్రపుటల్ని నింపేశాయి. వాటిలో కొన్ని చరిత్ర పుటల్ని రక్తాక్షరాలతో లిఖిస్తే.. మరికొన్ని శాంతి మార్గంలో లక్ష్య తీరాలను చేరాయి. మన స్వాతంత్ర్య పోరాటంలో కూడా అతి, మిత వాదుల గమ్యం ఒకటే అయినా దారులు మాత్రం వేరుగా కనిపిస్తాయి. ఎంచుకున్న దారిని బట్టే గమ్యం చేరువుతుంది. అదే బాటలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ శాంతిమార్గంలోనే ఉద్యమిస్తున్నారు. పదేళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది. నాయకుడు అంటే ఆశయ సాధన కోసం ముందుండి పోరాడాలి. తనను నమ్మిన వాళ్లకోసం ఊపిరిని కూడా తృణ ప్రాయంగా వదిలేసేందుకు సిద్ధపడాలి. తెలంగానమే ఊపిరిగా నినదిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కూడా కూడా అలాంటి నేతే. ఒక్క రక్తం చుక్క కూడా చిందకుండా, హింసాత్మక బాటలో అడుగు పెట్టకుండా... తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు. తన మాటలతో ఉద్యమ స్ఫూర్తిని నరనరానా ఎక్కించగల దిట్ట. ప్రజల్లో సెంటిమెంట్‌కు అనుకూలంగా పార్టీ  నడుపుతున్న నేత.. ఉద్యమాన్ని చెయ్యదాటిపోనివ్వకుండా... అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న మాటల మరాఠీ కేసీఆర్‌. 

కేసీఆర్‌ అంటే ప్రత్యర్థి పార్టీల నేతల తక్కువగా అంచనా వేస్తారు. కానీ ఉద్యమ బాటలో తొలి అడుగువేసిన నాటి నుంచి నేటి వరకూ కేసీఆర్‌ ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. ప్రత్యర్థులు సృష్టించిన రాజకీయ అవరోధాల్ని ఎవరి ఊహలకు కూడా అందని వ్యూహాలతో నెగ్గుకు రాగల రాజకీయ చతురుడు, ప్రత్యర్థుల్ని మాటలతోనే మట్టికరింపించగల మాటల మరాఠీ కేసీఆర్‌. ఉక్కులాంటి ఉద్యమాన్ని ఎప్పుడు వంచాలో.. ఎలా వంచాలో.. ఎటు వంచాలో ఔపోసన  పట్టిన నేత. ప్రజల నాడిని, వాళ్ల మనోభావాలు గుర్తెరికి.. వారిని ఉద్యమం వైపు నడిపిస్తున్న నాయకుడు. రాజకీయాల్లో కేసీఆర్‌ తొలిఅడుగు... అన్నగారి వెంటే పడింది. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న సమయంలో పార్టీకు, పదవికి రాజీనామా చేసి.. 2001 ఏప్రిల్ ‌27న  తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపిస్తున్నట్లు హైదరాబాద్‌ జలదృశ్యంలో కేసీఆర్‌ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమైంది. ముప్పై ఏళ్ల కిందట మిన్నంటిన తెలంగాణ ఉద్యమానికి దీటుగా మరోసారి జై తెలంగాణ నినాదాన్ని మిన్నంటేలా చేశారు కేసీఆర్‌. ఉద్యమం కూడా ఉక్కు లాంటిదే. దాన్ని ఎప్పుడు ఎలా వేడెక్కించాలో... ఎంత వరకూ వంచాలో తెలిసిన నేత కేసీఆర్‌. అందుకే పదేళ్లుగా ఉద్యమాన్ని తన కంట్రోల్‌ ఉంచుకోగలిగారు. కేసీఆర్‌ పని అయిపోయిందని ప్రత్యర్థులు విమర్శించిన ప్రతిసారి.... కెరటంలా ఉవ్వెత్తున ఎగుస్తూనే ఉన్నారు. దీక్షలతో కేంద్రాన్ని సైతం కదిలించిన కేసీఆర్‌... తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందడుగు వేస్తున్నారు. పటిష్ట ప్రణాళికతో గ్రౌండ్‌ లెవల్‌ నుంచి ఉద్యమానికి కొత్త ఊపిరులూదున్న నాయకుడు కేసీఆరే. 

ఆవిర్భించిన తొలినాటి నుంచే టీఆర్ఎస్‌ తన సత్తా ఏంటో నిరూపించుకుంటోంది. కరీంనగర్‌లో సింహ గర్జన సభలో టీఆర్‌ఎస్‌ను రాజకీయ పార్టీగా ప్రకటించిన కేసీఆర్‌... అదే ఏడాది జూన్‌లో జరిగిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలను తమ తొలి టార్గెట్‌గా నిర్ణయించుకున్నారు. తక్కువ టైంలోనే ఉద్యమ స్ఫూర్తిని నింపుకొచ్చారు. ఆ ఎన్నికల్లో అంచనాల్ని తలకిందులు చేస్తూ.. టీఆర్‌ఎస్‌ వంద ఎంపీటీసీలు, 85 జెడ్పీటీసీలు, మూడు వేల సర్పంచ్‌ స్థానాలు దక్కించుకుందంటే  కారణం కేసీఆరే. ఈ గెలుపు టీఆర్‌ఎస్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. 2001 ఆగస్ట్‌ 18న టీఆర్‌ఎస్‌ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌ తెలంగాణలో మరింత సంస్థాగతంగా స్ధిరపడేలా పావులు కదిపారు కేసీఆర్‌. సెప్టెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను సిద్దిపేట ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. అలా తొలిసారి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టిన కేసీఆర్‌ వెనుదిరిగి చూడలేదు.

నాటి నుంచి 2004 ఎన్నికల వరకూ ఉద్యమవేడి ఏ మాత్రం తగ్గకుండా నిలుపుకొచ్చారు కేసీఆర్‌. దీంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నేతలే కేసీఆర్‌ ఇంటికొచ్చి మరీ పొత్తులు పెట్టుకున్నారు. అలా 2004లో చేయ్యితో చెయ్యి కలిపి కూటమిగా బరిలోకి దిగిన కేసీఆర్‌ 26 స్థానాలు, 5 ఎంపీ స్థానాలు దక్కించుకుని కారు స్పీడేంటో చూపించారు. ఆపై కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నారు. యూపీఏ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశాన్నీ చేర్చేలా, రాష్ట్రపతి చేసిన తొలి ప్రసంగంలోనూ తెలంగాణ అంశం ఉండేలా చేయగలిగారు. నాటి నుంచి ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ అలుపెరగని పోరు చేస్తూనే ఉన్నారు. ఆ కృషి ఫలితంగానే... 2005 జనవరిలో ప్రణబ్‌ నేతృత్వంలో తెలంగాణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటయ్యింది. ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటుకు ఔనన్న కాంగ్రెస్‌ హైకమాండ్‌ క్రమేపీ ఈ అంశాన్ని పక్కన బెట్టింది. అక్కడి నుంచి కేసీఆర్‌కు ఎదురు గాలి వీచడం మొదలైంది. ప్రత్యక్ష రాజకీయాల్లో టీఆర్‌ఎస్ బలపడుతున్న టైంలోనే పార్టీలో అసమ్మతి సెగ రేగింది. ఆలె నరేంద్ర, సంతోష్‌ రెడ్డి వంటి నేతలు తిరుగుబావుటా ఎగరేశారు.

ఇది జరిగిన కొద్ది రోజులకే... మరో ఎనిమిది మంది కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇది కేసీఆర్‌కు రాజకీయంగా తగిలిన తొలి ఎదురు దెబ్బ. ఈ తిరుగుబాటుతో టీఆర్‌ఎస్‌ పరిస్థితి అయిపోయిందనుకున్నాయి ప్రత్యర్థి పార్టీలు. కానీ కేసీఆర్‌ ఈ వివాదాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించారు. లేఖరాసిన వారిలో తూర్పు జయప్రకాష్‌ రెడ్డి, శారారాణి, దుగ్యాల శ్రీనివాసరావులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పరిస్థితిని సర్దుబాటు చేశారు. నాటి నుంచి కేసీఆర్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ పార్టీను బలోపేతం చేసే దిశగా అడుగులేశారు. కేంద్రం తెలంగాణ మీద నిర్ణయాన్ని ఆలస్యం చేస్తుండటంతో 2006 సెప్టెంబర్‌ 13న యూపీఏ వన్‌కు గుడ్‌ బై చెప్పారు. తనకు తెలంగాణే తప్ప పదవులు అక్కర్లేదని కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తిరిగొచ్చిన కేసీఆర్‌ను ... కరీంనగర్‌ ప్రజలు రెండు లక్షల భారీ మెజార్టీతో గెలిపించారు. అప్పటికీ కేంద్రం దిగి రాకపోవడంతో... 2008లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు తెరతీశారు. కానీ ఆ ఉప  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. 16 అసెంబ్లీ స్థానాలకు 7, నాలుగు లోక్‌సభ స్థానాలకు కేవలం రెండు మాత్రమే దక్కించుకుంది. ఇది కేసీఆర్‌కు తగిలిన  రెండో దెబ్బ.దీన్ని కూడా సమర్థంగానే నెట్టుకొచ్చారు కేసీఆర్‌. 2009 వరకూ తెలంగాణలో ఉద్యమాన్ని మరింత లోతుగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్‌ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అప్పటివరకూ సమైక్యాంధ్ర అన్న టీడీపీ కూడా జై తెలంగాణ అంది. 2009లో లెఫ్ట్‌ పార్టీలతో సహా.. కేసీఆర్‌ మద్దతుతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. కానీ ఆ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు పరాభవమే ఎదురైంది. కేవలం పది స్థానాలతో మాత్రమే గులాబీ దళం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పొత్తులే తమ వైఫల్యాలకు కారణమని గ్రహించిన కేసీఆర్‌... వెనువెంటనే  మహాకూటమికి గుడ్‌బై చెప్పారు. 
కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడ్డారు అని ప్రత్యర్థులు అనుకునే టైంలోనే... మరోసారి పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగుస్తారు. కేసీఆర్ పని అయిపోయిందన్న పరిస్థితులు తలెత్తున్న టైంలో మరోసారి సత్తా చాటుతారు కేసీఆర్‌. అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో కేసీఆర్‌ మించిన నేతే లేరనే చెప్పాలి. వైఎస్‌ మరణం తర్వాత... రాష్టంలో నాయకత్వ శూన్యత ఉన్న టైంలో మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిల్చారు. రోశయ్య ప్రకటించిన పోలీసు నియామకాల ప్రకటనను తనకు అనుకూలంగా మార్చుకుని ఫ్రీ జోన్‌ మీద నినదించారు. ఫ్రీజోన్‌ అంశంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని 2009 నవంబర్‌ 29న ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కానీ రెండు రోజులు తిరక్కుండానే కేసీఆర్‌ దీక్ష తెలంగాణ అంతటా ఉద్యమ స్ఫూర్తి రగిల్చింది. తెలంగాణ యావత్తూ భగ్గుమంది. విద్యార్ధుల ఆందోళనలు మిన్నంటాయి. కేసీఆర్‌ దీక్షకు దీంతో దిగొచ్చిన కేంద్రం తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్‌ 9న ప్రకటన చేసింది. నాటి కేసీఆర్‌ దీక్ష రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని సమూలంగా మార్చేసింది. అలా నాటి నుంచి రగిలిన ఉద్యమ స్ఫూర్తిని వేడి తగ్గకుండా... నిలుపుకుంటూ వస్తున్నారు. ఉద్యమానికి కొత్త బాటలు వేస్తున్నారు కేసీఆర్‌. ఈ రెండేళ్లలో ఉద్యమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి.. కేంద్రం మెడలు వంచగలిగారు కేసీఆర్‌. అలా అలుపెరగని పోరాట పటిమతో ... కేసీఆర్‌ ఇప్పుడు తెలంగాణలో హీరో అయ్యారు. 


ఈ పదేళ్ల ప్రయాణంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి కేసీఆర్‌ ఎదగడానికి ఉద్యమం కోసం ఆయన పడే తపన ఒక్కటే కాదు... పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు పన్నే రాజకీయ చతురత కూడా కారణమే. ఒక్క మాటతో తన వాళ్లకు దగ్గరవుతూ... ప్రత్యర్థులకు చురకలు పెట్టగలిగిన వాక్చాతుర్యం, సెంటిమెంట్‌ రగిల్చి ప్రజల్ని ఏకం చెయ్యగల నాయకత్వం, ఇతర పార్టీల నేతల్ని తమవైపు తిప్పుకోగల నైపుణ్యం ఇవన్నీ ఒక్క కేసీఆర్‌కే సాధ్యం. నాడు కేసీఆర్‌ దీక్ష... నేడు తెలంగాణకు రక్షగా మారింది. కేంద్రం అనుకూల ప్రకటన తర్వాత... సమైక్య ఉద్యమంతో కొద్దిగా వెనకడుగు వేసినా...తర్వాత శ్రీకృష్ణ కమిటీ వేసి పరిస్థితిని అంచనా వేసింది. ఆపై అఖిల పక్ష భేటీలు, సమావేశాలు, నేతల నివేదికలు అంటూ తెలంగాణపై కేంద్రం సాగదీత వైఖరి అవలంబిస్తున్నా... తెలంగాణాన్ని సీరియస్‌గా పరిగణించేలా చేసింది మాత్రం కేసీఆరే. కమిటీ నివేదిక తర్వాత... ఉద్యమాన్ని మరోసారి రగిల్చేందుకు 14ఎఫ్‌పై ఉద్యమించారు కేసీఆర్‌. 14ఎఫ్‌ పై తీవ్రస్థాయిలో ఆందోళనలనకు సిద్ధమయ్యారు. దీంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పుతుందన్నుకున్న కేంద్రం ఆగమేఘాల మీద 14ఎఫ్‌ను రద్దుచేసే దిశగా అడుగులేసింది. అలా కేంద్రాన్ని పరుగులు పెట్టించిన క్రెడిట్‌ కేసీఆర్‌కే దక్కుతుంది. 

కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా రావడంతో టీఆర్‌ఎస్‌ మరోసారి ధ్వజమెత్తింది. ఇక అప్పటికైనా కేసీఆర్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే... తెలంగాణలో తమ ఉనికి గల్లంతవుతుందనుకున్న మిగిలిన పార్టీలు కూడా ఉద్యమంలో తామూ ఉన్నామని చెప్పేలా రాజీనామాలు చేశారు. ఇలా టీటీడీపీ, టీ కాంగ్రెస్‌ అంటూ ఏర్పడి టీఆర్‌ఎస్‌కు దీటుగా ఉద్యమ బాట పట్టారు. ఇది కేసీఆర్‌కు ఇబ్బందే అయినా పెద్ద సమస్య కాలేదు. పదేళ్ల నుంచి తెలంగాణ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన కేసీఆర్‌ నుంచి ఆ క్రెడిట్‌ కొట్టేయడానికి మిగిలిన పార్టీలు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అణుమాత్రం కూడా వారికి సాధ్యం కాలేదు. తెలంగాణ ఉద్యమం అనగానే  దేశమంతా గుర్తొచ్చేది కేసీఆరే తప్ప మరో పార్టీ నేత కాదు. ఇదే కేసీఆర్‌ బలం. అందుకే ఎన్ని పార్టీలు తెలంగాణకు జై అన్నా... క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతోంది. అంతెందుకు ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా... ఆ గొప్పతనం కేసీఆర్‌కే దక్కుతుంది తప్ప... కాంగ్రెస్‌కు కాదు. అంతలా ఉద్యమాన్ని అందిపుచ్చుకున్నారు కేసీఆర్‌.ఫ్రీజోన్‌ అంశంలో 14ఎఫ్‌ను రద్దు చేస్తే ఉద్యమ వేడి చల్లారిపోతుందనుకున్న కేంద్రం...  కేసీఆర్‌ వ్యూహం ముందు కేంద్రం చతికిలపడింది. సకల జనుల సమ్మెతో ఇటు రాష్ట్రానికి, అటు కేంద్రానికి ముచ్చెమటలు పట్టించారు కేసీఆర్‌. రికార్డు స్థాయిలో ఏకంగా 42 రోజుల పాటు... అన్ని శాఖల ఉద్యోగులతో సమ్మె చేయించి తెలంగాణ సెంటిమెంట్‌ ఎంత బలంగా ఉందో మరోసారి చాటి చెప్పారు. అలా ఇప్పుడు ఏ పార్టీ నేతలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్‌ నుంచి తెలంగాణ బ్రాండ్‌ మాత్రం లాక్కోలేకపోతున్నారు. 

ఉద్యమ బాట పడుతున్న మిగిలిన నేతలకు సమయానుకూలంగా సంఘీభావం తెలుపుతున్నా... కేసీఆర్‌ మాత్రం తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. 2010 ఉపఎన్నికల్లో  చెన్నమనేని చేరికతో... 11 పెరిగిన టీఆర్‌ఎస్‌ బలాన్ని ఒక్కొక్కటే పెంచుకుంటూ పోతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను మరింత పటిష్ట పరిచే దిశగా అడుగులేస్తున్నారు. సెంటిమెంట్‌ ఆయుధంతో తెలంగాణలో సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీను బలహీనపరుస్తున్నారు. టీడీపీలో ఉంటూ ఉద్యమం చేస్తే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారన్న భావనను అటు ప్రజల్లోకి, ఇటు టీడీపీ నేతల్లోకి జొప్పించడంలో సఫలమయ్యారు. ఇప్పటికే  చెన్నమనేని మొదలైన వలసలు వరదలా మారిపోయాయి. పోచారం శ్రీనివాస్‌, గంపా గోవర్ధన్‌, నాగంతో పాటు పార్టీ వీడిన జోగురామన్న, వేణుగోపాలాచారిలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేతలకూ కేసీఆర్‌ వేసిన వల వర్కవుట్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోడానికి సిద్దమవుతున్నారు. వీరే కాకుండా మరో ఇద్దరు ఎంపీలపైనా కేసీఆర్‌ గురి పెట్టారు. ఇలా తెలంగాణలో ఇతర పార్టీల ప్రజా ప్రతినిధుల్ని తమ వైపు తిప్పుకోవంలో కేసీఆర్‌ అనుసరిస్తున్న వ్యూహం చూసి కాకలు తీరిన రాజకీయ నాయకులకే దిమ్మ తిరిగిపోయింది. ఇక ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్‌ను ఎంత ఇరుకున పెట్టాలని చూసినా... తన వాక్చాతుర్యంతో వాటిని తిప్పికొట్టడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమ విషయంలో  మైళ్లకు మైళ్లు వెనకబడి ఉన్న టీడీపీ పోలవరం విషయంలో కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలను చాలా తెలివిగా తిప్పికొట్టారు. 

రాజకీయాల్లో నేతలు మాటలతో కోటలు కడితే... కేసిఆర్‌ మాత్రం మాటలతో తూటాలు పేలుస్తారు. భాష మీద పట్టు, సమకాలీన రాజకీయ, చారిత్రక అంశాలపై లోతైన అవగాహన ఉన్న నేత కాబట్టి.. కేసీఆర్‌ ఎలాంటి విమర్శలనైనా చిటికలో తిప్పికొట్టి.. ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌ మొదలు పెట్టాకే అన్ని పార్టీలూ గొంతు కలిపాయి. కేసీఆర్‌ తెలంగాణ కోసం ఉద్యమ బాట పడితే... మిగిలిన పార్టీలు మాత్రం రాజకీయావసరాల కోసం ఉద్యమం చేస్తున్నాయి.  ఇంకా చెప్పాలంటే... కేసీఆర్‌ ఉద్యమం చేస్తున్నాడు కాబట్టే తాము ఉద్యమం చేస్తున్నారు. కేసీఆర్‌ ఉద్యమమే జీవితంగా ముందుకెళ్తుంటే... టీడీపీ, కాంగ్రెస్‌లు ఉద్యమం రేగినప్పుడే మాట్లాడుతున్నాయి. అవసరం వచ్చినప్పుడు మిగిలిన పార్టీలు గళమెత్తుతుంటే... కేసీఆర్‌ మాత్రం అణుక్షణం తెలంగాణ కోసమే పోరాడుతున్నారు. 1969 తర్వాత నివురు గప్పిన నిప్పులా కణకణమంటున్న ఉద్యమాన్ని మరోసారి ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ శక్తి కేసీఆర్‌. ఉద్యమం సమర్థంగా నడిపించింది కేసీఆరే అయినా... ఆయనకు మార్గదర్శనం చేసిన మేధావి మరొకరున్నారు. వాళ్లతో పాటు ఎందరో మరెందరో తెలంగాణ నిర్మాణానికి రాళ్లెత్తారు. తెలంగాణ చరిత్ర చెప్పాలంటే కేసీఆర్‌, జయశంకర్ ల పేర్లు లేకుండా చెప్పడం కష్టమే. 
1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినా...దాన్ని రాజకీయ నిర్ణయాలతో చల్లార్చారు. ఆ తర్వాత 1972లో జై ఆంధ్ర ఉద్యమం తలెత్తంది. అప్పట్లోనే కాకాని వెంకటరత్నం  నేతృత్వంలో జై ఆంధ్ర ఉద్యమం రాజుకుంది. అది కూడా కొన్నాళ్లు రాజకీయ జోక్యంతో చల్లారింది. అప్పటి నుంచి ఉద్యమ జాడలే రాష్ట్రంలో కనిపించలేదు. ఉద్యమ నినాదాలు వినిపించలేదు. కానీ 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌లోని  జలదృశ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు.. తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్యమమైనా నాయకత్వం పటిమను బట్టే నడుస్తుంది. అలా టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ క్రియాశీలంకంగా వ్యవహరిస్తూ ముందుకెళ్లారు. పదమూడేళ్లుగా ఉద్యమాన్ని క్రియాత్మకంగా నడిపిస్తూ, ఆమరణ దీక్షలు, రాజీనామాలతో రాజీలేని పోరాటం చేసుకుంటూ వచ్చారు కేసీఆర్‌. అందుకే ఆయన్ను తెలంగాణ జాతి పిత అని యావజ్జాతి కొనియాడుతోంది. ఇక కేసీఆర్‌ ఉద్యమం మొదలు పెట్టేనాటికి ఆయనతో ఉన్నది ప్రొఫెసర్‌ జయశంకర్ ఒక్కరే. ఉద్యమానికి చుక్కానిగా నిలిచింది కూడా ఆయనే. 1969లో ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి నివురుగార్చారంటూ.. నేటి ఉద్యమానికి కొత్త రూపును సంతరింప చేసింది ఆయనే. ఉద్యమాన్ని రాజకీయంగా బలపర్చాలని టీఆర్ఎస్‌ను రాజకీయ పంథాలో ముందుకెళ్లమనీ చెప్పింది కూడా ఆయనే. జయశంకర్‌ నేతృత్వంలో, ఆయన చెప్పిన బాటలో కేసీఆర్ అడుగులేశారు. అందుకే కేసీఆర్ మొదటి నుంచి రాజకీయంగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. 
ఇక ఉద్యమ చైతన్యం నాయకుల్లో పాటు ప్రజల్లో కూడా కలిగించాలని చెప్పింది కూడా ప్రొఫెసర్ జయశంకరే. గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలంగాణ ఎందుకు కావాలో తెలియచేయాలన్నారు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లింది ఆయనే.  నీళ్లు, నిధులు, నిరుద్యోగం విషయంలో తెలంగాణ ప్రజలు ఎలా దోపిడీకి గురవుతున్నారో తెలిసేలా చేసిందీ ఆయనే. ఇలా జయశంకర్‌ రూపొందించిన కార్యాచరణలో అడుగేసిన కేసీఆర్‌ ఉద్యమాన్ని, రాష్ట్రావిర్భావం వరకూ నడిపించారు. 
ఇక వీళ్లిద్దరితో పాటు టీజేఏసీ కూడా ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించింది. తెలంగాణ ఏర్పాటుకు పోరాడుతున్న శక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు ఆవిర్భవించిన ప్రయత్నమే టీజేఏసీ. 2009లో ఏర్పడిన టీజేఏసీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్‌, మిలియన్‌ మార్చ్‌ వంటి తీవ్రమైన ఆందోళనలో భాగం పంచుకుని ఉద్యమ స్ఫూర్తిని నిలుపుకుంటూ వచ్చింది టీజేఏసి. ఉద్యమ ఆందోళనలలో భాగంగా రాస్తా రోకోలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించింది. టీజేఏపీ సభ్యులు ఎన్నో సార్లు అరెస్టయ్యారు. వారి మీద ఎన్నో కేసులు పెట్టారు. అయినా సరే వారు దేనికీ భయపడకుండా ముందుకెళ్లారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 
టీ జేఏసీ అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రొఫెసర్ కోదండరాం. ఇటు ఉద్యోగుల్ని, అటు విద్యార్థుల్ని, మరోపక్క తెలంగాణ ప్రజల్ని నడిపించిన ప్రత్యామ్నాయ శక్తి తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి. తొలినాటి నుంచి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న టీజేఏసీ... ఒకానొక దశలో టీఆర్‌ఎస్‌  నుంచి దూరమైందన్న అభిప్రాయాలు కూడా కనిపించాయి. దీనికి తోడు ఇటు కోదండరాం, అటు కేసీఆర్‌ మధ్య పెరిగిన దూరం కూడా అది నిజమే అన్నంతగా ఊతమిచ్చింది. రాజకీయంగా ఒక నిశ్శబ్దం అలముకున్న వేళలో... టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగరహారం తెలంగాణ ఉద్యమంలో కొత్త ఉత్సాహం నింపింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో గతేడాది నిర్వహించిన సాగరహారం.. ఉద్యమ సత్తాను మరోసారి కేంద్రానికి రుచి చూపించింది. ఉద్యమం అయిపోయిందిలే అనుకుని ఎన్నికలు సిద్దమవుతున్న కేంద్రానికి సాగర హారం చెంపపెట్టులా తాకింది. ఇలా ఉద్యమంలో టీజేఏసీ చెప్పుకోదగ్గ కీలకభూమిక పోషించింది. ఒకరకంగా చెప్పాలంటే ఉద్యమం రాజకీయంగా నీరుగారుతున్న టైంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేసింది, ఉద్యోగులను, విద్యార్థులను ఏకం చేసింది కూడా టీజేఏసీనే. 14 ఎఫ్‌ రద్దు, 610 జీవో అమలు వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉద్యమానికి ఊపిరులూదింది టీజేఏసీ.