కీలక భేటీకి సిద్ధమైన కేసీఆర్.. ఏ పంట వేయాలో తేల్చేస్తారు..!

కీలక భేటీకి సిద్ధమైన కేసీఆర్.. ఏ పంట వేయాలో తేల్చేస్తారు..!

తెలంగాణలో పంట సాగుపై ఎల్లుండి సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ, రైతు సంఘం అధికారులకు ఈ సమావేశానికి ఆహ్వానం అందింది. జిల్లాల వారీగా సాగుచేయాల్సిన పంటలపై సీఎం వారితో చర్చించి, నియంత్రిత సాగు విధానాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఏయే ప్రాంతాల్లో ఏ పంటలు పండించాలన్నదానిపై ముఖ్యమంత్రి సూచనలు చేయనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో పంటసాగు సాయం కింద ఇచ్చే రైతుబంధుకు.. కేసీఆర్ పంటలు లింక్‌ పెట్టిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే.. రైతుబంధు పథకం వర్తింపజేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.