సీఎం జగన్ పీకిన క్లాసుకు ఎమ్మెల్యేలు సైలెంట్ !

సీఎం జగన్ పీకిన క్లాసుకు ఎమ్మెల్యేలు సైలెంట్  !

సీఎం పీకిన క్లాస్‌ పని చేసిందా? అందుకే అందరి నోళ్లకు తాళాలు పడ్డాయా? కీలకమైన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై తలోమాట మాట్లాడిన పలువులు అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ నేతల నుంచే డిమాండ్స్‌!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతమున్న13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామంటూ పాదయాత్రలోనూ.. ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌ హామీ ఇచ్చారు. పవర్‌లోకి వచ్చిన ఏడాది తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఫోకస్‌ పెట్టారు ముఖ్యమంత్రి. ఎప్పుడైతే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందో.. అప్పటి నుంచి వివిధ జిల్లాల్లో రకరకాల డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. భిన్న స్వరాలను వినిపించిన వారిలో అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారు.
 
ఇప్పుడు ఆ కామెంట్లు, చప్పుళ్లు వినపడటం లేదు!

శ్రీకాకుళం జిల్లాను విడగొట్టదని సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గట్టిగానే మాట్లాడారు. అనంతపురం జిల్లాలో పెనుకొండ కేంద్రంగా.. పుట్టపర్తి కేంద్రంగా జిల్లాలు కావాలనే డిమాండ్లు వినిపించాయి. కర్నూలు జిల్లాలో కూడా ఆలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు వాయిస్‌ వినిపించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాస్తో కూస్తో ఈ డిమాండ్లను నెరవేర్చాలనే కామెంట్లు అధికార పార్టీ నేతల నుంచి గతంలో వచ్చేవి.  ఇప్పుడు ఆ కామెంట్లు.. చప్పుళ్లు ఏ మాత్రం వినపడటం లేదు. అప్పట్లో వివిధ వాయిస్‌లను వినిపించిన నేతలంతా ష్‌ గప్‌చుప్‌ అంటున్నారు. 
 
కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం జగన్‌ వార్నింగ్‌?

ఈ విధంగా నేతల నోళ్లకు తాళాలు పడడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత కెబినెట్‌ భేటీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జరిగిన చర్చలో సీఎం జగన్‌ కొందరు మంత్రులకు సీరియస్ వార్నింగ్‌ ఇచ్చారట. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తన వైఖరిని.. ప్రభుత్వ ఆలోచనను ఇద్దరు మంత్రులకు స్పష్టంగా చెప్పారట. కొత్త కొత్త డిమాండ్లని.. అంశాలను తెర మీదకు తీసుకురావద్దని గట్టిగా చెప్పారని సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ బాధ్యతను మొత్తంగా అధికారులకే అప్పజెబుతున్నామని.. ఇందులో రాజకీయపరమైన జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని హెచ్చరిక స్వరంతోనే ఆదేశాలు జారీ చేశారట సీఎం జగన్. 

 అభ్యంతరాలు చెప్పాలనుకున్నవారు సైలెంట్‌!

ఈ క్రమంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అభ్యంతరాల చెప్పాలనుకున్న కొందరు అధికార పార్టీ నేతలు మనకెందుకు వచ్చిన గొడవ అన్నట్టు సైలెంటయిపోయారని అంటున్నారు. రాజధాని వికేంద్రీకరణ వంటి పెద్ద విషయంలోనే స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌కు.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎలాంటి నెగెటీవ్‌ కామెంట్లు చేయడం లేదు. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటులో గొంతెత్తి ఇబ్బందులు ఎదుర్కొవడమే తప్ప.. వేరే ఉపయోగం ఏదీ ఉండదని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారు.. ఎక్కడికక్కడ గమ్మున ఉండిపోతున్నట్టు తెలుస్తోంది.
 
బీఫారాలు తీసుకున్నప్పుడు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు?

ఇదే సమయంలో పార్టీలోని ఇంకొందరు నేతలు ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎవరైతే అభ్యంతరాలు తెలియచేయాలని భావిస్తున్నారో... ఆ అభ్యంతరాలను పార్టీ టిక్కెట్లను.. బీ-ఫారాలు తీసుకున్న సమయంలో ఎందుకు చెప్పలేదని సెటైర్లు వేస్తున్నారట. ఏది ఏమైనా.. కొత్త జిల్లాల విషయంలో అధికార పార్టీ నేతల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా.. జగన్‌ వార్నింగ్‌తో అందరూ సెట్‌ అయినట్టే కన్పిస్తోంది.