‘ప్రజలే ముందు’ అనేది మా నినాదం...

‘ప్రజలే ముందు’ అనేది మా నినాదం...

"ప్రజలే ముందు''(పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించామని తెలిపారు. అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం... వేలకోట్ల ఆర్ధికలోటులో కూడా పెట్రోధరల తగ్గింపు సాహసోపేతమైన నిర్ణయమని... ప్రజలకు రూ.1,100కోట్ల ప్రయోజనం కలిగించామని... లీటర్ కు రూ.2 తగ్గింపు పేదలకెంతో ఊరట నిచ్చిందని తెలిపారు. కేంద్రంలో ఆ మాత్రం ఉదారం కూడా లేకపోవడం దురదృష్టకమని మండిపడ్డ ఏపీ సీఎం... రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించాలని కేంద్రం చూస్తోందని... ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని చూశారని... రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూస్తున్నారు... రాష్ట్రంలో టీడీపీని బలహీన పరచాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణలో బీజేపీ ఏకపక్షంగా పొత్తులేదని ప్రకటించిందని మండిపడ్డారు చంద్రబాబు... ఏపీలో వైసీపీతో అంటకాగుతున్నారని ఆరోపించిన ఆయన కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే గైర్హాజరు అయ్యారని... ఢిల్లీ వస్తానని చెప్పినవాళ్లు పత్తాలేరని... కేంద్రం వైఫల్యాలపై జగన్‌ఎప్పుడూ నోరు తెరవడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిమానిటైజేషన్, జీఎస్టీ, పెట్రోల్, డీజిల్ ధరలపై ఏనాడూ మాట్లాడలేదని గుర్తు చేసిన ఏపీ సీఎం... ప్రజావ్యతిరేక చర్యల వల్లే టీడీపీ... ఎన్డీఏ నుంచి వైదొలిగిందన్నారు. రాష్ట్రాలలో సమర్ధ నాయకత్వం లేకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని... ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రం ఎందుకు పూడ్చదు? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల రాష్ట్రాభివృద్ధి మన కష్టం, మన తెలివితేటలతోనే సాధించాం. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించిన చంద్రబాబు... అందుకు అసెంబ్లీ, కౌన్సిల్ ను వేదికగా చేసుకోవాలన్నారు. సభలో జరిగే చర్చలలో అందరూ భాగస్వాములు కావాలని... చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా హౌసింగ్‌లో పేదలకు ఎంతో లబ్ధి చేకూరిందన్నారు.