హిందూపురం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్

హిందూపురం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్

ఊరికి ఎంతో మంది నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. నేను మాత్రం లోకల్. పక్కా లోకల్ అని గట్టిగానే చెబుతున్నారు ఆ నాయకుడు. ఈ లోకల్‌ నాన్‌ లోకల్‌ సమస్యతో రచ్చకెక్కి మాటల యుద్ధానికి దిగుతున్నారు ఒకే పార్టీకి చెందిన నేతలు. 

హిందూపురంలో నాన్‌లోకల్‌ లీడర్లదే హవా!

హిందూపురం. ఈ నియోజకవర్గానికి రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పోటీ చేస్తున్న వారు.. గెలుస్తున్న వారు ఎక్కువ మంది నాన్ లోకల్‌. 1983లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆ తరువాత ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణలు హిందూపురం నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ట్రాక్ రికార్డు చూసిన వైసీపీ కూడా గత ఎన్నికల్లో నాన్‌ లోకల్‌ లీడర్‌కే టికెట్‌ ఇచ్చింది. మాజీ పోలీస్‌ అధికారి మహ్మద్‌ ఇక్బాల్‌ను బరిలో దింపినా వైసీపీకి కలిసి రాలేదు. ఎవరు గెలిచినా ఓడినా.. స్థానిక లీడర్ల కంటే దిగుమతి చేసుకున్నవారికే ఇక్కడ ప్రాధాన్యం అన్న ప్రచారం పాతుకుపోయింది. 

2019 నవీన్‌ను కాదని ఇక్బాల్‌కు వైసీపీ టికెట్‌!

హిందూపురంలో వైసీపీ నేత నవీన్‌ నిశ్చల్‌ గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నవీనే వైసీపీ అభ్యర్ధిగా భావించారు. సామాజిక సమీకరణాల ఎఫెక్టో ఏమో నవీన్‌ను కాదని మహ్మద్‌ ఇక్బాల్‌కు టికెట్‌ ఇచ్చింది వైసీపీ. ఆ ఎన్నికల్లో ఓడినా ఇక్బాల్‌ను ఎమ్మెల్సీని చేశారు. హిందూపురం వైసీపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు. వైసీపీలో ఏం జరుగుతుందా అని నవీన్‌ వర్గం తెలుసుకునేలోపుగానే అంతా జరిగిపోయింది. 

నవీన్‌ వర్గాన్ని పట్టించుకోని ఇక్బాల్‌ వర్గం?

హిందూపురంలో నవీన్‌ నిశ్చల్‌ వర్గాన్ని ఇక్బాల్‌ పట్టంచుకోవడం లేదట. పైగా ఏదైనా పనిపై వెళ్తుంటే ఎవరు మీరు అని ఇక్బాల్‌ ప్రశ్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీలో లోకల్‌.. నాన్‌ లోకల్‌ సమస్య రాజుకుందని చెబుతున్నారు. బయట నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన నాయకులు స్థానికులపై పెత్తనం చేయడాన్ని సవాల్‌ చేస్తున్నారట. పార్టీలో కూడా స్థానికంగా ఇదో సమస్యగా మారినట్టు సమాచారం. నవీన్‌ పాల్గొనే ప్రతి సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరుగుతోందట. ఎక్కడి నుంచో వచ్చి  హిందూపురంలో పెత్తనం చేయాలని చూస్తే ఊరుకోబోమని ఓపెన్‌గానే కామెంట్‌ చేస్తున్నారట నవీన్‌. ఇక్కడ అంశాలను పార్టీ పెద్దలు కూడా ఓ కంట కనిపెడుతున్నట్టు సమాచారం. మరి.. లోకల్‌ నాన్‌ లోకల్‌ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. ఇద్దరు నాయకుల మధ్య సయోధ్య కుదుర్చుతారో లేదో చూడాలి.