విజయనగరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..!

విజయనగరం వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..!

అంతా సమసిపోయిందని అనుకున్న వేళ అక్కడ వర్గపోరు మళ్లీ మొదలైందా? నేతలు భాయ్‌ భాయ్‌ అనుకుంటుంటే.. కేడర్‌ మాత్రం కత్తులు దూస్తోందా? జిల్లా కేంద్రంపై పట్టుకోసం తెర వెనక స్కెచ్‌లు వేస్తున్నారా? ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఒక్కసారిగా యాక్టివ్‌ కావడానికి కారణం ఏంటి? 

రెబల్స్‌ వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా?

అప్పట్లో ఆగిపోయిన కార్పొరేషన్‌ ఎన్నికలు.. మళ్లీ మొదటి నుంచి మొదలుపెడతారో లేక ఆగిన దగ్గర నుంచే ప్రారంభిస్తారో కానీ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం గేర్‌ మార్చడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ నేతలను కలిసి ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ప్రస్తావించిన అంశాలు కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ కొత్తగా మొదలైతే తమకు వైసీపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని ముందుకెళ్లిన రెబల్స్‌ ఇప్పుడు.. న్యాయం చేయాలంటూ  మంత్రి, ఎంపీ, ఇతర నేతల దగ్గరకు వెళ్లడంపై గుసగుసలు మొదలయ్యాయి. రెబల్స్‌ వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. విజయనగరం పట్టణంపై పట్టుకోసమే బొత్స వర్గం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని టాక్‌. 

కేడర్‌ మధ్య అసంతృప్తి మళ్లీ బుస కొడుతోందా? 

బొత్స, కోలగట్ల ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. ఇద్దరు సన్నిహితులే. బొత్స కంటే ముందుగానే వైసీపీలో చేరిపోయారు వీరభద్రస్వామి. జిల్లాలో తానే వైసీపీకి తిరుగులేని నాయకుడిని అని ఆయన అనుకుంటున్న సమయంలో బొత్స రాకతో సమస్య మొదలైందని చెబుతారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య  చాపకింద నీరులా విభేదాలు ఉన్నాయి. వీరి మధ్య పంచాయితీలు గతంలో పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లాయి. అక్కడ సర్దిచెప్పి పంపినా క్షేత్రస్థాయిలో తీరుమారలేదు.  ఒకానొక సమయంలో ఎన్నికల్లో ఇద్దరూ ఒకరినొకరు ఓడించుకునేందుకు సైతం స్కెచ్‌లు వేసుకున్నారని పార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి. ప్రస్తుతం బొత్స, కోలగట్ల కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా.. కేడర్‌ మధ్య ఏర్పడిన గ్యాప్‌ అలాగే ఉందట. అదే ఇప్పుడు మళ్లీ బుస కొడుతున్నట్టు సమాచారం. మరి ఈ విభేదాలు శ్రుతి మించి రోడ్డున పడకుండా వైసీపీ అధిష్ఠానం ఎలాంటి మంత్రం వేస్తుందో చూడాలి.