తాడికొండ వైసీపీలో సరికొత్త పోరు?

తాడికొండ వైసీపీలో సరికొత్త పోరు?

రాజకీయంగా కీలకమైన తాడికొండలో పట్టుకోసం వైసీపీలో సరికొత్త పోరు మొదలైందా? ఎంపీ, ఎమ్మెల్యే కలిసిపోతే తన సంగతేంటని మరో నాయకుడు ప్రశ్నిస్తున్నారా? విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వర్గం తాతయ్యా అంటూ కొత్తపల్లవి అందుకుందా? సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు ఊదరగొడుతోందా? 

తాడికొండ వైసీపీలో కొత్త కథ?

గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య కొన్నాళ్లు వైరం నడిచింది. పార్టీలో పెద్ద దుమారం రేపాయి. నాటకీయ పరిణామాల మధ్య ఇద్దరు ప్రజాప్రతినిధులు రాజీకొచ్చేశారు. వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో తాడికొండలో కొత్త కథ మొదలైందట. 

ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య రాజీ తర్వాత ఆసక్తికర పరిణామాలు!

టీడీపీ నుంచి వైసీపీలో చేరి తిరిగి ఎమ్మెల్సీ అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌ సైతం తాడికొండ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. దీనికి ఇటీవల తాడికొండలో జరిగిన పరిణామాలను ఉదహరణగా చెబుతున్నారు పార్టీ నాయకులు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఒకప్పుడు ఆమెకు ముఖ్య అనుచరులుగా ఉన్న వారికి మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం నడుస్తోంది. పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గొడవలు సద్దుమణిగిన తర్వాత ఈ గొడవలేంటని ఆరా తీశాయట పార్టీ వర్గాలు.  ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు తెలిశాయట.

తాతయ్యా అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు!

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ జోక్యం వల్లే వివాదాలు తెరమీదకు వస్తున్నాయని ఎమ్మెల్యే వర్గం అనుమానిస్తోందట. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నుంచి తన కుమార్తెను పోటీ చేయించేందుకే ఎమ్మెల్యే వ్యతిరేక వర్గాన్ని డొక్కా దువ్వుతున్నారని అనుకుంటున్నారట. దీనిపై నియోజకవర్గ ప్రజల్లోనూ.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో డొక్కా పేరును ప్రస్తావించకుండా.. ఆయన్ని టార్గెట్‌ చేస్తూ.. తాతయ్యా అంటూ సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు హీట్‌ పుట్టిస్తున్నాయి. 

సోషల్‌ మీడియా పోస్టులపై చర్చ!

ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంఛార్జ్‌గా రావాలంటే కష్టపడాలి కానీ... ఎమ్మెల్యే, ఎంపీలపై వేరెవరితోనో మొరిగించడం కాదంటూ డొక్కాపై పరోక్ష దాడి మొదలుపెట్టారు.  పెద్దవాడివి నీకు ఆ మాత్రం తెలియదా..  నీ వాయిస్‌ రికార్డులు కూడా ఉన్నాయ్‌ తాతయ్య అని సెటైర్లు వేశారు. పైగా ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంతో ఎవరు ప్రెస్‌మీట్లు పెట్టించారో ఇంటెలిజెన్స్‌ దగ్గర రిపోర్ట్‌ ఉందని ఆ పోస్టుల్లో  ప్రస్తావించారు. ఈ పోస్టులపై తాడికొండలో తీవ్రస్థాయిలోనే చర్చ మొదలైంది. 

తాడికొండలో మరో పవర్‌ సెంటర్‌!

ఈ పోస్టింగ్‌లు.. వ్యాఖ్యలు చూసిన తర్వాత నియోజకవర్గం వైసీపీలో మూడు స్తంభాలాట ప్రారంభమైందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కలిసి పనిచేసుకోవాలని పార్టీ పెద్దలు సూచిస్తే.. ఇప్పుడు మరో పవర్‌ సెంటర్‌ రావడం ఏంటా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. ఇప్పుడు రాజుకున్న ఈ ఎపిసోడ్‌ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.