సవాళ్లు ప్రతి సవాళ్లతో రగిలిపోతున్న టీడీపీ, వైసీపీ నేతలు..!

సవాళ్లు ప్రతి సవాళ్లతో రగిలిపోతున్న టీడీపీ, వైసీపీ నేతలు..!

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అని తేల్చేస్తున్నారు సిక్కోలు నాయకులు. ఎప్పటి నుంచో తెరవెనక జరుగుతున్న యవ్వారాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారట. నువ్వో.. నేనో తేల్చేసుకుందాం.. రా! అని సవాళ్లు విసురుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. ఇంతకీ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుంటున్న ఆ  నాయకులు ఎవరు? 

మాటకు మాట అప్పజెప్పేస్తున్న నేతలు!

రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు టార్గెట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎంతసేపూ పార్టీ అధినేతలపై విమర్శలతో కాలక్షేపం చేసే నేతలు ఇప్పుడు లోకల్‌గా డైలాగ్ వార్‌కు దిగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ అధినేతను లక్ష్యంగా చేసుకుని మాటల దాడికి దిగేవారు టీడీపీ నేతలు. స్థానికంగా ఎంత మంది వైసీపీ నాయకులు ఉన్నా వారి జోలికి టీడీపీ నాయకులు వెళ్లేవారు కాదు. దీంతో తమను కాదు కదా అని జిల్లా వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉండేవారు. టీడీపీ-కాంగ్రెస్‌ మధ్య రాజకీయం నడిచిన రోజుల్లోనూ తీరు ఇలాగే ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. మాటకు మాట అప్పజెప్పేస్తున్నారు. 

ధర్మాన-కింజరాపు కుటుంబాల మధ్య  ఇంటర్నెల్‌ ఒప్పందం? 

ముఖ్యంగా విమర్శలు, ప్రతివిమర్శల విషయంలో ధర్మాన-కింజరాపు కుటుంబాల మధ్య ఓ అండర్‌స్టాండింగ్‌ ఉండేదనుకునేవారు. ఎన్నికల సమయంలో ఈ రెండు కుటుంబాల మధ్య ఇంటర్నల్‌ ఒప్పందాలు జరిగేవని టాక్‌. ఆ విధంగా ఎన్నికల సమయంలో కాళింగ-వెలమ సామాజికవర్గాలను వినియోగించుకుని రాజకీయ తంత్రం నడిపేవారట. ఈ రెండు కుటుంబాల నుంచి ఎవరు గెలిచినా.. ఎవరు అధికారంలో ఉన్నా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండేవారట. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్నా.. ధర్మాన ప్రసాదరావు  కేబినెట్‌లో కొనసాగినా ఈ ఒప్పందం కొనసాగేదని సమాచారం. 

ఒంటికాలిపై లేస్తున్న డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌!

ఇప్పుడీ రహస్య ఒప్పందానికి తూట్లు పడ్డాయట. 2019 ఎన్నికల తర్వాత ధర్మాన ఫ్యామిలీ రూటు మార్చేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌.. కింజరాపు కుటుంబ వారసులపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇటీవల అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడైన తర్వాత ఎంపీ రామ్మోహన్‌నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచారు. బాబాయ్‌-అబ్బాయ్‌లకు స్థానిక వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నా.. డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ మాటల దాడిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. 

రహస్య ఫార్ములాకు చెక్‌ పడిందా? 

ప్రస్తుతం ఏ చిన్న అవకాశం వచ్చినా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడులపై స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారు డిప్యూటీ సీఎం. వారు చేసే అవినీతి ఆరోపణలను తిప్పి కొడుతూనే.. దమ్ముంటే నిరూపించండి అని సవాల్‌ చేస్తున్నారట. మీ ఆస్తుల లెక్క మా ఆస్తుల లెక్క తీద్దా రండి అని చిటపటలాడుతున్నారట కృష్ణదాస్‌. దీంతో రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న  ఇంటర్నెల్‌ పొలిటికల్‌ ఫార్ములాకు చెక్‌ పడిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

ప్రసాదరావు కూడా స్వరం పెంచుతారా? 

మరి.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఫార్ములా మార్చుకుంటారా? స్వరం మార్చి బాబాయ్‌-అబ్బాయ్‌లపై విరుచుకు పడతారా? ధర్మాన-కింజరాపు కుటుంబాల మధ్య రాజకీయం మలుపులు తీసుకున్నట్టేనా? సిక్కోలు రాజకీయాలు కొత్తగా ఉంటాయా అన్న ప్రశ్నలు చర్చల్లోకి వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.