ఐఏఎఫ్ సూచనలను తూచ తప్పకుండా పాటిస్తున్నాం

ఐఏఎఫ్ సూచనలను తూచ తప్పకుండా పాటిస్తున్నాం

తన మంత్రిత్వ శాఖ భారతీయ వాయుసేన ఇచ్చే మార్గదర్శకాలు, సూచనలను తూచ తప్పకుండా పాటిస్తోందని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా  ఇవాళ స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల దృష్ట్యా శ్రీనగర్, జమ్ము, లేహ్ సహా ఉత్తర భారతదేశంలోని మొత్తం 9 విమానాశ్రయాల్లో సేవలను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. 

తర్వాత కాసేపటికే తొమ్మిది ఎయిర్ పోర్టుల్లో సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. దీంతో తాము ఐఏఎఫ్ సూచనలను కఠినంగా పాటిస్తున్నామని, అదే కొనసాగిస్తామని మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. విమానాశ్రయాల మూసివేత ప్రకటనతో ఎన్ని విమాన సేవలు ప్రభావితమయ్యాయన్న ప్రశ్నకు కచ్చితమైన సంఖ్యలు తన దగ్గర లేవని చెప్పారు. 

ఇవాళ ఉదయం డీజీసీఏ ఒక నోటీస్ టు ఎయిర్ మెన్ (NOTAM) విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మే 27 వరకు శ్రీనగర్, జమ్ము, లేహ్, పఠాన్ కోట్, అమృత్ సర్, సిమ్లా, కాంగ్రా, కులూ మనాలీ, పితోర్ గఢ్ విమానాశ్రయాలలో విమాన సేవలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది.