విలక్షణంగా విజృంభించిన విక్రమ్!

విలక్షణంగా విజృంభించిన విక్రమ్!

ప్రతిభ ఉండాలే కానీ, పట్టం కట్టడానికి చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎన్నో మార్లు ఋజువయింది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు. చిత్రసీమలో రాణించాలని విక్రమ్ చిన్నతనం నుంచీ కలలు కన్నాడు. సినిమాల్లో తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించాడు. తమిళ చిత్రాలలోనే కాదు కొన్ని తెలుగు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఏదీ తగిన గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పి వేరే బాట పట్టాలనే యోచనలో ఉన్న విక్రమ్ కు 'సేతు' రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 'సేతు'లో విలక్షణమైన పాత్ర అయితే వరించింది. కానీ, ఆ సినిమా వెలుగు చూడటానికి పలు పాట్లు పడింది. చివరకు జనం ముందు నిలిచిన 'సేతు'తో విక్రమ్ ఒక్కసారిగా ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాడు. అప్పటి నుంచీ విలక్షణమైన పాత్రలకు విక్రమ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. తమిళ జనం గుండెల్లో 'చియాన్'గానూ నిలిచాడు. 

'అపరిచితుడు' తరువాత...

విలక్షణమైన అభినయంతో అలరిస్తున్న విక్రమ్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంటున్నాయి. ఆరంభంలో విక్రమ్ "చిరునవ్వుల వరమిస్తావా, అక్కపెత్తనం -చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఆడాళ్ళా మజాకా, ఊహ, అక్కా బాగున్నావా?, మెరుపు, కుర్రాళ్ళ రాజ్యం, 9 నెలలు, యూత్" వంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ లో నటించాడు. 'సేతు' ఘనవిజయం సాధించిన తరువాత కూడా అంతకు ముందు అంగీకరించిన 'యూత్' చిత్రాన్ని పూర్తి చేశాడు విక్రమ్. ఆ తరువాత నుంచీ విక్రమ్ తమిళనాట స్టార్ హీరో అయిపోయాడు. వరుసగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సాగిపోయాడు. విక్రమ్ హీరోగా తమిళనాట ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలను తెలుగు స్టార్ హీరోస్ రీమేక్ చేయడం విశేషం. విక్రమ్ తో 'సేతు' తెరకెక్కించిన దర్శకుడు బాలా తరువాత అతనితో తీసిన 'పితామగన్' తెలుగులో 'శివపుత్రుడు'గా అనువాదమైంది. ఈ సినిమాతోనే విక్రమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించాడు. 'శివపుత్రుడు' సినిమా తెలుగులోనూ విశేషాదరణ చూరగొంది. ఇక 'జెంటిల్ మేన్' శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'అన్నియన్' తెలుగులో 'అపరిచితుడు'గా అలరించింది. ఈ సినిమా విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచింది. ఆ తరువాత నుంచీ విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలతో సాగుతూనే ఉన్నాడు. కానీ, ఆ స్థాయి విజయం మాత్రం మళ్ళీ విక్రమ్ కు దక్కలేదనే చెప్పాలి. 'అపరిచితుడు' తరువాత విజయం విక్రమ్ కు దూరంగా జరగడానికి కారణమేంటో ఇప్పటికీ అభిమానులకు అర్థం కాకుండానే ఉంది. 

అబిమానుల అభిలాష...

నటునిగానే కాకుండా, గాయకునిగానూ, డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, టీవీ షోస్ తోనూ జనాన్ని ఆకట్టుకున్నాడు విక్రమ్. తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాడు విక్రమ్.  ఏదో ఒకరోజు విక్రమ్ మళ్ళీ విజృంభిస్తాడని అభిమానుల అభిలాష. ప్రస్తుతం విక్రమ్ నాలుగు చిత్రాలలో నటిస్తున్నాడు. వాటిలో మణిరత్నం 'పొన్నియన్ సెల్వం', గౌతమ్ మీనన్ 'అగ్ని నచ్చత్రం', అజయ్ జ్ఞాన ముత్తు తెరకెక్కిస్తున్న 'కోబ్రా' ఉన్నాయి. వీటితో పాటు విక్రమ్ 60వ చిత్రంగా మరో సినిమా రానుంది. ఇలా ఇప్పటికీ బిజీగానే సాగుతున్న విక్రమ్ రాబోయే రోజుల్లో మళ్ళీ మునుపటిలా అలరించాలని ఆశిద్దాం.

(ఏప్రిల్ 17న స్టార్ హీరో విక్రమ్ బర్త్ డే)