అన్ని బాధలూ తనకే ఉన్నాయని డిప్యూటీ సీఎం ఆవేదన...?

అన్ని బాధలూ తనకే ఉన్నాయని డిప్యూటీ సీఎం ఆవేదన...?

రాష్ట్రంలో ఎవరికీ లేనన్ని బాధలు తనకే ఉన్నాయని తెగ బాధపడుతున్నారు ఆ డిప్యూటీ సీఎం. గ్రూపు రాజకీయాలు కొలిక్కి రాకపోవడం.. ప్రతి విషయంలో కేడర్‌ చుక్కలు చూపిస్తుండటంతో ఒక అదిలింపు ఇచ్చారు. రాజకీయాల నుంచే తప్పుకొంటానని హెచ్చరించారు. అంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం? ఆయనకొచ్చిన బాధ ఏంటి? 

డిప్యూటీ సీఎంకు అన్నీ సమస్యలేనా? 

నారాయణస్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు పడని ఆయన.. డిప్యూటీ సీఎం అయ్యాక అన్నీ ఇబ్బందులేనట. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సమస్యలేంటా అని అంతా ఆశ్చర్యపోవచ్చు. కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విన్న తర్వాత అయ్యో.. నారాయణ అని కామెంట్స్‌ చేస్తున్నారట. 

ఎన్నికల్లో పనిచేయని వారికి పనులు అప్పగించారా? 

చిత్తూరు జిల్లా అంటే గ్రూప్ పాలిటిక్స్‌కి పెట్టింది పేరు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. నారాయణ స్వామి మంత్రి అయ్యాక.. గ్రూప్‌ పాలిటిక్స్‌ కాస్తా గంగాధర నెల్లూరులో పీక్స్‌ చేరాయట. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, SRపురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందుకు కారణాలు లేకపోలేదని చెబుతారు స్థానిక వైసీపీ నాయకులు. వైసీపీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా.. ఎన్నికల్లో ఒక్కపైసా ఖర్చు చేయనివారికి కాంట్రాక్ట్‌ పనులు.. ఇసుక రీచ్‌లు ఇచ్చారని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయట. 

టీడీపీ నేతల చేరికలపై స్థానిక వైసీపీ కేడర్‌ గుర్రు!

వెదురుకుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహణకు కొన్ని గ్రామాలకు అనుమతి ఇవ్వలేదు. దీనిని మనసులో పెట్టుకున్న కొంతమంది.. మాకు మీ దగ్గర విలువ లేదు.. మా కోసం ఒకరోజు వస్తారుగా అప్పుడు చూద్దాం అని నారాయణస్వామితో నేరుగానే చెప్పేశారట. ఈ సందర్భంగా వాగ్వాదానికి దిగారట. నిజానికి వెదురుకుప్పం మండలంలో రెండు వర్గాలుగా నాయకులు మధ్య వర్గ పోరు నడుస్తుంది. నెల క్రితం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు నాగరాజురెడ్డి.. టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి భీమ శంకర్ రెడ్డిలు డిప్యూటీ సీఎంను కాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ చేరికలు వైసీపీలోని మరో వర్గానికి రుచించలేదట. పైగా కొత్తగా పార్టీలో చేరిన వారిని సమావేశంలో  స్టేజ్‌పై ఎలా కూర్చొనిస్తారని ప్రశ్నించారట. ఇకపై వాళ్లతోనే అన్ని కార్యక్రమాలు చేసుకోండి అని డిప్యూటీ సీఎంతో తేల్చిచేప్పారని టాక్.

వద్దంటే చెప్పండి..! రాజకీయాల నుంచి తప్పుకొంటా..!!

స్థానిక సంస్థల ఎన్నికల వస్తే.. అప్పుడు తమ సత్తా చూపిస్తామని కేడర్‌ హెచ్చరించడంతో తన అసహనాన్ని నారాయణ స్వామి బయటపెట్టేశారట. గ్రామం నుంచి కొందరిని తరిమివేయాలంటే ఎలా? ఎక్కడైనా అలాంటి చట్టం ఉందా?.. మీరు వద్దంటే చెప్పండి రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అని డిప్యూటీ సీఎం కేడర్‌ ముఖం మీదే చెప్పేశారట. జల్లికట్టుపై నేనేమీ చేయలేకపోయాను.. ఎస్పీతో మాట్లాడినప్పటికీ అనుమతి ఇవ్వలేదు.. ప్లీజ్ అర్థం చేసుకుని మారండని కేడర్‌తో ఆయన వేడుకున్నారట.

ఎన్నాళ్టి నుంచో ఆవేదన ఉందా? 

గ్రూపు రాజకీయాలకు తోడు.. అధికారులు మాట వినకపోవడంతో.. ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారట డిప్యూటీ సీఎం. ఈ అంశంపై ఎప్పటి నుంచో ఆవేదన ఉన్నా.. సమయం చూసుకుని బరస్ట్‌ అయ్యారని అనుకొంటున్నారు.  మరి.. సొంత నియోజకవర్గంలోని వైసీపీలో తలెత్తిన సమస్యలకు చెక్‌ పెడతారా?  లేక  ఇలాగే తన బాధలు చెప్పుకొంటూ ఉండిపోతారో చూడాలి.