టీఆర్ఎస్ నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు...

టీఆర్ఎస్ నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు...

ఇద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఎప్పటి నుంచో నివురు గప్పిన నిప్పులా ఉన్న కోల్డ్‌వార్‌ ఇప్పుడు భగ్గుమంది. ప్రత్యర్థి పార్టీ నాయకుల్లా ఒకరిపై ఒకరు రోడ్డుకెక్కడం హాట్‌ హాట్‌గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఏమా కథ? 

నిత్యం కత్తులు నూరుకుంటారు!

ఈయన  కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. ఈయనేమో చిరుమర్తి లింగయ్య.  నకిరేకల్‌ ఎమ్మెల్యే. ఇద్దరు నాయకుల మధ్య కామన్‌ పాయింట్‌ అధికార పార్టీ శాసనసభ్యులు.  అందరికీ తెలిసిన మరో విషయం.. ఇద్దరకీ అస్సలు పడదు. వేర్వేరు చోట్ల నుంచి  ఎమ్మెల్యేలుగా ఉన్నా.. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో నిత్యం కత్తులు నూరుకుంటూనే ఉంటారు. కడుపు చీల్చుకుంటే కాళ్ల మీద పడినట్టు.. ఇటీవల వీళ్ల గొడవలు రోడ్డున పడ్డాయి. 

వేర్వేరు పార్టీలలో ఉంటున్నప్పటి నుంచే విభేదాలు!

2018 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయిన భూపాల్‌రెడ్డి నల్లగొండలో కోమటిరెడ్డి వెంటరెడ్డిని ఓడించారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఓడించి కాంగ్రెస్‌ నుంచి రెండోసారి నకిరేకల్‌ ఎమ్మెల్యే అయ్యారు చిరుమర్తి లింగయ్య. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా కాంగ్రెస్‌ కండువా తీసేసి టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు చిరుమర్తి. అంతకుముందు వేర్వేరు పార్టీలలో ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలు ఓ రేంజ్‌లో ఉండేవి. తర్వాత భూపాల్‌రెడ్డి, లింగయ్యలు టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత గొడవలు సద్దుమణిగినట్టే కనిపించింది. 

నకిరేకల్‌లో కూడా భూపాల్‌రెడ్డి వర్గం ఉందా? 

లోకల్‌ ఎన్నికలు.. నామినేటెడ్‌ పోస్టుల దగ్గరకు వచ్చేసరికి భూపాల్‌రెడ్డి, లింగయ్యలు ఢీ అంటే ఢీ అనుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయిలో గొడవ పడ్డారు ఎమ్మెల్యేలు. భూపాల్‌రెడ్డి సొంతూరు నకిరేకల్‌ నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో ఉంది. చిట్యాల, నార్కట్‌పల్లి మండలాల్లో ఆయనకంటూ కొంత కేడర్‌ ఉందని చెబుతారు. స్థానిక ఎన్నికల్లో తన వర్గానికి కూడా టికెట్లు ఇవ్వాలని భూపాల్‌రెడ్డి.. చిరుమర్తిని కోరారు. దానికి చిరుమర్తి ఒప్పుకోలేదు. పైగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి భూపాల్‌రెడ్డి తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని చిరుమర్తి అనుమానిస్తున్నారట. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సంబంధాలు ఉప్పునిప్పులా మారిపోయాయి. 

ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి జగదీష్‌రెడ్డి క్లాస్‌!

చిట్యాల దగ్గర కంచర్ల సోదరులకు కాటన్‌ మిల్‌ ఉంది. పత్తి కొనుగులు సమయంలో టోకెన్‌ విధానం అమలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి ఆదేశించారు. ఎక్కడా లేని నిబంధనలు తన సొంత మిల్లుపైనే ఎందుకు అని భూపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లును మూసేస్తున్నట్టు ప్రకటించారాయన. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో మిల్లు తిరిగి ఓపెన్‌ చేశారు కంచర్ల సోదరులు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే లింగయ్య తమను వేధిస్తున్నారని  అనుమానిస్తున్నారు భూపాల్‌రెడ్డి. చివరకు ఈ పంచాయితీ మంత్రి జగదీష్‌రెడ్డికి చేరింది. పార్టీకి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లాస్‌ తీసుకున్నారట మంత్రి.  ఆ తర్వాత ఇద్దరూ సైలెంట్‌ అయ్యారు. మరి..  భవిష్యత్‌లో కలిసి సాగుతారో.. కలిసిమెలిసి ఉన్నట్టు నటిస్తూ కలహాలకు  దిగుతారో చూడాలి.