చిరంజీవి, కమల్ హాసన్ - భలే పోలిక!

చిరంజీవి, కమల్ హాసన్ - భలే పోలిక!

చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరూ కె.బాలచందర్ స్కూల్ లో తర్ఫీదు పొందినవారే. వీరిద్దరూ కలసి బాలచందర్ 'ఇది కథ కాదు'లో నటించారు. చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరికీ ఓ చిత్రంతో బంధం ఉంది. అలాగే రాజకీయాల్లోనూ వారిద్దరి నడుమ ఓ పోలిక పొడసూపింది. ఆ వివరాల్లోకి వెళ్తే - చిరంజీవి తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం 'రుద్రవీణ'కు తన గురువు కె.బాలచందర్ నే దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, మూడు నేషనల్ అవార్డులు సాధించింది. 'రుద్రవీణ'కు జాతీయ సమైక్యతాభావం చాటిన చిత్రంగా నర్గీస్ దత్ అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజాకు, ఉత్తమ గాయకునిగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు నేషనల్ అవార్డులు అందాయి. నాలుగు నంది అవార్డులనూ సొంతం చేసుకుంది 'రుద్రవీణ'. ఇందులో తన ఊరిని బాగుచేసే ప్రయత్నంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడమూ త్యాగం చేస్తాడు హీరో. చివరకు అతని త్యాగాన్ని గుర్తించిన ఊరి ప్రజల్లో మార్పు వస్తుంది. కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమాతోనే చిరంజీవి దృష్టి సామాజిక సేవ వైపు సాగిందని చెప్పొచ్చు. 'రుద్రవీణ' తెలుగులో అంతగా అలరించలేదు. తమిళంలో బాలచందర్ సొంతగా ఈ చిత్రాన్ని కమల్ హాసన్ హీరోగా 'ఉన్నల్ ముడియుమ్ తంబి'పేరుతో రీమేక్ చేశారు. అక్కడా ఫలితం ఏమీ మారలేదు. 

కమల్ హాసన్ 'మక్కల్ నీదిమయం' పార్టీ నెలకొల్పినప్పుడు ఆయన సమాజహితం కోరిన చిత్రాలను అభిమానులు తలచుకున్నారు. అందులో 'ఉన్నల్ ముడియుమ్ తంబి' పాటలనూ గుర్తు చేసుకున్నారు. అంటే బాలచందర్ తన శిష్యులు కమల్ హాసన్, చిరంజీవి ఇద్దరిలోనూ సామాజిక హితంపై మనసు మళ్ళడానికి కారకులయ్యారన్నమాట. చిరంజీవి 2009లో 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టి అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 294 సీట్లలో దాదాపు అన్ని చోట్లా పోటీ చేశారు. చిరంజీవి రెండు చోట్ల పోటీ చేయగా, తిరుపతిలో గెలిచారు. పాలకొల్లులో ఓడిపోయారు. మరో 17 సీట్లతో కలిపి, మొత్తం 18 సీట్లు ప్రజారాజ్యం పార్టీకి లభించాయి. ఆ తరువాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ విషయానికి వస్తే తమిళనాడులోని 234 సీట్లలో 142 నియోజకవర్గాల్లో కమల్ పోటీ చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో సౌత్ కొయంబత్తూరు నుండి పోటీ చేసిన కమల్ ఓటమి చవిచూశాడు. ఇక్కడే జనానికి మళ్ళీ 'రుద్రవీణ' గుర్తుకు వచ్చింది. ఆ సినిమాను ముందు తీసిన చిరంజీవికి నేషనల్, స్టేట్ అవార్డ్స్ అయినా లభించాయి. తరువాత నటించిన కమల్ కు ఏమీ రాలేదు. అలాగే ముందు పార్టీ పెట్టిన చిరంజీవికి 18 సీట్లయినా దక్కాయి. కమల్ కు ఒక్కటీ లేదు. అలా ఈ ఇద్దరు హీరోలు సామాజిక సేవాదృక్పథంతో నటించిన సినిమాలూ అంతగా అలరించలేదు. అలాగే ఇద్దరూ రాజకీయాల్లోనూ రాణించలేకపోయారు. చిరంజీవికి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా కేంద్రంలో మంత్రిపదవి అయినా దక్కింది. 

కొసమెరుపు ఏంటంటే, 2009లో చిరంజీవి, ఇప్పుడు కమల్ హాసన్ ఇద్దరూ ఆడవాళ్ళ చేతిలో పరాజయం పాలు కావడం. 2009లో చిరంజీవి కాంగ్రెస్ కు చెందిన బంగారు ఉషారాణి చేతిలోనూ, ఇప్పుడు కమల్ హాసన్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలోనూ ఓటమి పాలయ్యారు. ఇంతకూ భలే పోలిక కదూ!