వైసీపీ పెద్దల వద్దకు చీరాల పంచాయితీ...ఏం చేస్తారో ?

వైసీపీ పెద్దల వద్దకు చీరాల పంచాయితీ...ఏం చేస్తారో ?

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ వర్గ పోరు పార్టీ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి చీరాల నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచి అన్నట్టుగా మారిపోయింది. బలరాం రాకను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరు వర్గాల మధ్య ఉన్న కోల్డ్‌ వార్‌ మరింత పెరిగింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఏర్పడింది.

ఇప్పటికే ఈ రెండు వర్గాలు పలుమార్లు దాడులకు దిగాయి. తాజాగా కరణం బలరాం పుట్టినరోజు సంబరాల వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమంచి, కరణం వర్గాలు బహిరంగంగానే ఒకరి పై ఒకరు రాళ్ళ దాడి చేసుకున్నారు.  స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా చీరాలలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పార్టీ పెద్దలు ఆమంచి, కరణం వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఇరు వర్గాలు పార్టీ పెద్దల ముందు తమ అభిప్రాయాలు చెప్పారు.

ఆ రోజు దాడికి సంబంధించిన వీడియో క్లిప్పింగుల్ని పార్టీలు పెద్దలు చూశారు. తమ వర్గం తప్పేది లేదని... ఆసమయంలో చీరాలలోనే లేనని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని కరణం బలరాం వర్గం చెబుతోంది. మరో వైపు దురుద్దేశంతోనే తమ ఇంటి పక్కన పుట్టిన రోజు కార్యక్రమం పెట్టి రెచ్చగొట్టారని ఆమంచి వర్గం ఆరోపించింది. వివిధ దారులు ఉన్నా తమ ఇంటి ముందు నుంచే వెళ్లేలా పోలీసుల నుంచి అనుమతి సంపాదించారని మండిపడుతోంది ఆమంచి వర్గం. ఇరు వైపుల వాదనలు విన్న పార్టీ పెద్దలు చీరాల పంచాయితీని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సి ఉంది.