నారావారి పల్లె పై ఫోకస్ పెంచిన వైసీపీ..! 

నారావారి పల్లె పై ఫోకస్ పెంచిన వైసీపీ..! 

రాజకీయ చదరంగంలో ప్రత్యర్థుల ఎత్తులు కామన్‌. ఎన్నికలకు వచ్చేసరికి ఎవరు సత్తా చాటుతారో.. ఎవరు చిత్తు అవుతారో చెప్పలేం. కీలకమైన ఆ గ్రామాలలో పట్టు సాధించాలని అధికార పార్టీ.. పట్టు కోల్పోకుండా పోరాడాలని విపక్షం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. చిత్తూరు జిల్లా రాజకీయలను ఆసక్తిగా మారుస్తున్నాయి.

రసకందాయంలో చిత్తూరు జిల్లా పల్లె రాజకీయాలు!

పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అధికార, విపక్ష పార్టీల ఎత్తుగడలు ఆసక్తిగా ఉన్నాయి.  టీడీపీకి బలంగా ఉన్న గ్రామాల్లో పాగా వేయాలని అధికారపార్టీ వైసీపీ పావులు కదుపుతుంటే.. పట్టుకోల్పోకుండా ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు.. చర్చ పల్లె రాజకీయాలను రసకందాయంలో పడేస్తున్నాయి. 

నారావారిపల్లెపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోకస్‌!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఇదే జిల్లాలో ఉంది. ఆయన సొంతూరు  నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఈ రెండుచోట్ల వైసీపీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. టీడీపీ అధినేత ఇలాకలో వైసీపీ జెండా రెపరెపలాడించి పార్టీ అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేసే ఆలోచన చేస్తున్నారట. అదే జరిగితే ప్రమోషన్‌ కూడా వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. 

టీడీపీ గ్రామాల్లో ఏకగ్రీవాలపై వైసీపీ ఫోకస్‌!

చంద్రబాబు సొంతూరుకు సమీపంలోనే టీడీపీకి బలమైన గ్రామంగా గుర్తింపు తెచ్చుకున్న కందులవారిపల్లెపైనా పట్టుసాధించే పనిలో చెవిరెడ్డి ఉన్నారట. ఇక్కడ టీడీపీ విజయాలకు బ్రేక్‌లు వేసేందుకు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే వైసీపీ టికెట్‌ ఇవ్వబోతున్నట్టు సమాచారం. వైసీపీ ముఖ్యనేతలు కొందరు ఇక్కడే ఉండి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ గ్రామాల్లో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేలా పావులు కదుపుతున్నారట. 

గ్రామాల్లో రెండు పార్టీల శక్తులు మోహరింపు!

నారావారిపల్లెలో ఇప్పటికే ఒక సభను నిర్వహించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. కమ్మకండ్రిగను తమ ఖాతాలో వేసుకున్నారు. కందులవారిపల్లెలోనూ దానినే రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆలస్యం జరగడంతో టీడీపీ శ్రేణులు ప్రతివ్యూహాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. నష్టం జరగకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట టీడీపీ నేతలు. రెండు పార్టీల నుంచి శక్తులను మోహరించడంతో అసెంబ్లీ ఎన్నికలను మించిన వాతావరణం గ్రామాల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. 

ఎవరు పాగా వేస్తారు? 

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల ప్రభావం ఇక్కడి గ్రామాల్లో కనిపిస్తుండటంతో ఎవరు పాగా వేస్తారు? ఎవరు డీలా పడతారన్నది ప్రజల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. వైసీపీ నేతలు పట్టు సాధిస్తారో? టీడీపీ నేతలు పట్టు నిలుపుకొంటారో చూడాలి.