రాజన్న సన్నిధిలో ప్రజలకు దేవుడే దిక్కా?

రాజన్న సన్నిధిలో ప్రజలకు దేవుడే దిక్కా?

 

నాన్న వారసత్వంగా రాజకీయాల్లో వచ్చి నిలబడ్డారు. ఎమ్యెల్యేగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు.  ప్రజలు ఆ స్థాయిలో ఆదరిస్తే.. ఆయన మనసు మాత్రం ఎక్కడో అన్నట్లు ఉంది. చివరకు కరోనా కష్ట కాలంలోనూ కనిపించకుండా పోయారు. ఇంతకీ ఎవరా  ఎమ్మెల్యే? ఏమా కథ? 
 
కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేరు!

చెన్నమనేని రమేష్‌. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే. 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచీ  పౌరసత్వ వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్రం హోంశాఖ అనేక సార్లు రమేష్‌ భారత పౌరుడు కాదని చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఎమ్మెల్యే రమేష్‌ ప్రజలకు అందుబాటులో లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
వేములవాడలో వైద్యసదుపాయాల కల్పనలో చొరవ లేదా?

రాజన్న సన్నిధి అయిన వేములవాడలో గత నెలరోజులగా  పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమ గోడు ఎవరికైనా చెప్పుకుందామని ప్రజలు భావిస్తే.. వారికి స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ అందుబాటులో లేరు. దీంతో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు జనాలు. మిగతా ఎమ్మెల్యేలు.. తమ నియోజకవర్గంలో కరోనా బాధితులకు చికిత్సలో లోటు లేకుండా... పరీక్షలు నిర్వహించేలా.. వైద్య సదుపాయాలు కల్పించేలా చొరవ తీసుకుంటున్నారు. వేములవాడలో ఆ పరిస్థితి లేదన్నది  స్థానికుల మాట. 
 
మార్చి 18న జర్మనీ వెళ్లిపోయిన రమేశ్‌!

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మార్చి 18న జర్మనీ వెళ్లారు. ఆ తర్వాత ఐదు రోజులకే మన దేశంలో లాక్‌డౌన్‌ మొదలైంది. అప్పటి నుంచీ అక్కడే ఉండిపోయారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే.. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేకపోవడంలో వేములవాడ రాలేకపోతున్నట్లు చెబుతున్నారట ఎమ్మెల్యే. మాకు ఇదేం కొత్త కాదని.. గతంలోనూ ఎక్కువ రోజులు బయట దేశాల్లో ఉంటూ.. వేములవాడకు వచ్చిన  సందర్భాలు తక్కువేనని నియోజకవర్గానికి చెందిన మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారట. 
 
జర్మనీ నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా సందేశాలు!

గతాన్ని పక్కన పెడితే.. కనీసం కరోనా సమయంలో అయినా ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత లేదా అని విపక్షపార్టీలు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. జర్మనీ నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా  ప్రజలకు సందేశాలు ఇస్తున్నారట. అయితే.. కరోనా ఇండియాలో ప్రవేశించి.. ఉధృతమైతే జర్మనీ వెళ్లలేనేమోనన్న భయంతో ముందుగానే అక్కడికి వెళ్లిపోయారన్న విమర్శ కూడా రమేష్‌పై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తారో తెలియదు. ఒకవేళ వచ్చినా.. మళ్లీ చుట్టపు చూపుగానే వస్తారా లేక కొన్నాళ్లు అయినా ఉంటారా అన్నట్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గుసగుస లాడుకుంటున్నారట. మరి.. చెన్నమనేని రమేష్‌ ఏం చేస్తారో చూడాలి.