అసలు ధోనీసేనకు ఏమైంది..? ఏంటి తలైవా ఇది..!

అసలు ధోనీసేనకు ఏమైంది..? ఏంటి తలైవా ఇది..!

ధోనీసేనకు ఏమైంది ? చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎందుకిలా ఆడింది ? చెన్నై జట్టు అభిమానుల్ని ఎందుకు ఇంతలా నిరుత్సాహపరిచింది ? మూడుసార్లు ఛాంపియన్.. రెండుసార్లు రన్‌రప్‌.. ఇది ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ట్రాక్‌ రికార్డు.. మేటి ఆల్‌రౌండర్లు.. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసే బౌలర్లు.. అన్నింటికీ మించి మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన తర్వాత ధోనీ ఆటతీరును ఐపీఎల్‌లో చూసేందుకు.. అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ ఐపీఎల్‌లో తమ అభిమాన కెప్టెన్‌ రాణిస్తే చూడాలని ఎంతో ఆతృతతో వెయిట్‌ చేశారు. దుబాయ్‌ ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అయితే, ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటతీరును చూశాక.. ధోనీ అభిమానులు తీవ్ర నిరాశలో పడిపోయారు. ఈ ఐపీఎల్.. ధోనీ అభిమానులకు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌కు ఒక పీడకలలాంటిదే. ఐపీఎల్లో ఎప్పుడూ టాప్‌-4లో ఉండే చెన్నై సూపర్‌ కింగ్స్.. ఈసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేక.. రేసు నుంచి తప్పుకున్న తొలి టీమ్‌గా నిలిచింది.

ఈ ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన.. కేవలం మూడంటే మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. పాయింట్స్‌ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చూస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డూప్లెసిస్‌, రాయుడు, ధోనీ, జడేజా.. ఎవ్వరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ఆల్‌రౌండర్‌ కరన్ .. ఒక్కడే పోరాడాడు. టెయిలెండర్లతో కలిసి ఒంటరిపోరాటం చేశాడు. కరన్‌ ఆ మాత్రం పోరాడకపోయి ఉంటే.. చెన్నై 50 పరుగులలోపే చాపచుట్టేసేదేమో. ఈ సీజన్‌లో మొదటి నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తడబడుతూనే ఉంది. హేమహేమీలు లాంటి ఆటగాళ్లు ఉన్నా.. ఎవరూ క్లిక్‌ కాలేదు. జట్టులో ఉన్న వాట్సన్, ధోనీ, బ్రావో, జడేజా..  పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పరుగులు చేయడానికి తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా ఇబ్బందిపడ్డాడు మిస్టర్ కూల్. హెలికాఫ్టర్‌ షాట్లతో అలరించే జార్ఖండ్‌ డైనమేట్.. ఈ సీజన్‌లో దూకుడుగా ఆడటంలో ఫెయిలయ్యాడు. అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గా.. చాలా స్ట్రగులయ్యాడు తలైవా. రైనా, హర్భజన్‌ టోర్నీకి దూరంకావడంతో.. ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే చెన్నైకి ఎదురుదెబ్బ తగిలింది. మధ్యలో రాయుడు, బ్రావో గాయాలతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం కూడా ప్రభావం చూపింది. అయితే మ్యాచ్‌ల్లో గెలుపోటములు సహజం. కాకపోతే కనీసం పోరాడకుండా ఓడిపోవడమే.. చెన్నై అభిమానుల్ని కలవరపెడుతోంది. మరీ, ఇంత ఈజీగా హ్యాండ్సప్‌ అంటే ఎలా అని ఆవేదన చెందుతున్నారు సూపర్‌ కింగ్స్ అభిమానులు.