చెన్నై గెలిచింది.. కోల్‌కతా ఆశలకు గండికొట్టింది

 చెన్నై గెలిచింది.. కోల్‌కతా ఆశలకు గండికొట్టింది

చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన థ్రిల్లర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విక్టరీ కొట్టింది. ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌.. వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 173 రన్స్‌ లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై జట్టులో వాట్సన్‌ ఫెయిలయ్యాడు. రాయుడు అండతో రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 37 బంతుల్లో రుతురాజ్‌ అర్థసెంచరీ నమోదు చేశాడు. 38 పరుగులు చేసిన రాయుడుని కమిన్స్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత కుర్రన్‌, జడేజా రాణించారు. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి పది పరుగులు అవసరం కాగా.. తొలి 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే చివరి రెండు బంతుల్ని సిక్సులుగా మలచి.. చెన్నైని గెలిపించాడు జడేజా.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ జట్టులో.. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, నితీష్‌ రాణా.. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన సునీల్‌ నరైన్‌ వచ్చీ రాగానే భారీ సిక్స్‌ కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. కాసేపటికే రింకూ సింగ్‌ కూడా వెనుదిరగడంతో కేకేఆర్‌ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో  నితీష్‌ రాణా వీరవిహారం చేశాడు. ఇక చివర్లో దినేష్‌ కార్తీక్‌ 10 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో కేకేఆర్‌.. 172 రన్స్‌ కొట్టగలిగింది.