శ్రీధర్ రెడ్డి బెట్టింగ్ కేసులో పక్కా ఆధారాలు

శ్రీధర్ రెడ్డి బెట్టింగ్ కేసులో పక్కా ఆధారాలు

జగన్ పాదయాత్రతో పాటు ప్రత్యేకహోదా విషయంలో వైసీపీకి జనంలో మంచి ఆదరణ దొరుకుతున్న టైంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ వైసీపీ శ్రేణులను కంగారు పెడుతోంది. నెల్లూరు కేంద్రంగా సాగిన క్రికెట్ బెట్టింగ్ రాకెట్ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచినట్లు పోలీసులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కేవలం తనపై బురద జల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. ఆధారాలతో సహా వాటిని నిరూపించాలని కోటంరెడ్డి చెబుతూ వస్తున్న తరుణంలో... ఈ వ్యవహారానికి సంబంధించిన బలమైన ఆధారాలను కనుగొన్నారు పోలీసులు.

బెట్టింగ్ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తోన్న కృష్ణసింగ్‌తో కోటంరెడ్డి విజయవాడలోని హోటల్‌లో సన్నిహితంగా ఉన్నప్పటివీ.. పలుమార్లు అతనితో భేటీ అయిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు సంపాదించారు. అంతేకాకుండా అతను పరారీ అయినప్పుడు అండర్‌గ్రౌండ్‌లో ఉండటానికి కోటంరెడ్డి ఎలా సాయం చేశారో కూడా పోలీసులు వద్ద తగిన ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఇందుకు గాను కృష్ణసింగ్ నుంచి కోటంరెడ్డి రూ.23 లక్షలు పుచ్చుకున్నట్లు కూడా ఆధారాలు లభించాయట. ఈ మేరకు నెల్లూరు ఎస్పీ పూర్తి ఆధారాలతో డీజీపీ మాలకొండయ్యను కలవడంతో.. ఆయన తదుపరి విచారణను ఏసీబీకి అప్పగించారు. దీంతో ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి మీద కేసు నమోదయ్యింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ మేరకు ఈ నెల 14న విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం కోటంరెడ్డికి సమన్లు జారీ చేసింది. ఇప్పటివరకు తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవంటూ బుకాయిస్తూ వస్తోన్న శ్రీధర్ రెడ్డి ఈసారా పక్కా ఆధారాలతో దొరకడంతో.. ఏ విధంగా స్పందిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.