అనంత టీడీపీ నేతలకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు..?

అనంత టీడీపీ నేతలకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు..?

ఉన్నవాళ్లంతా చతికిలపడ్డారు. కొత్తవాళ్లొస్తే ఏదైనా మార్పువస్తుందనుకున్నారు. పైగా పార్టీ కష్టకాలంలో ఉంది. కొత్త రక్తంతో ఏమైనా ఊపొస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ, అనుకున్నదొకటి.. అయిందింకొకటి.. మళ్లీ పాతకాపులకే పట్టంకట్టారని దిగాలు పడ్డారు. అనంత తెలుగు తమ్ముళ్ల కత ఇది. 

పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది.. ఇది సహజం. రాజకీయాల్లో కూడా అంతే. కానీ, ఈ జిల్లాలో మాత్రం పాత నీరు పోదు.. కొత్త నీరు రావటం లేదని పార్టీ శ్రేణులు అసంతృప్తిలో పడ్డారట. అనంతపురం జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. సాధారణ  వ్యక్తులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఈ జిల్లాలో అవకాశం వచ్చింది.  ఇక్కడ టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉందంటారు. నాయకుడు ఎవరన్నది ఇక్కడ చూడకుండా, సైకిల్ గుర్తు, పసుపు జెండాకు పట్టంగట్టిన సందర్భాలున్నాయి. కానీ, ఇప్పుడు పార్టీకి ఆ జిల్లాలో బ్యాడ్ టైమ్ నడుస్తోంది. 

కొత్తగా పార్లమెంట్ ఇన్ చార్జ్ లను నియమించింది టిడిపి అధిష్టానం. అయితే అనంతపురం జిల్లాలో ఈ పదవులకు నియమించిన వారిపై అసంతృప్తులు పెరుగుతున్నాయి. హిందూపురం పార్లమెంట్ ఇన్ ఛార్జిగా బికే పార్థసారధి, అనంతపురం పార్లమెంట్ ఇన్ ఛార్జిగా కాలువ శ్రీనివాసులను నియమించారు. అయితే పార్టీశ్రేణుల్లో దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. 

టీడీపీ రాష్ట్రంలోనే కాదు.. కాకుండా అనంతపురం జిల్లాలో కూడా చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. గతంలో  ఎప్పుడూ ఇంతటి నిస్తేజం లేదు. నియోజకవర్గాల్లో వైసీపీ దెబ్బకు అసలు ఊసే లేకుండా పోయింది. చాలా చోట్ల జెండా మోసిన వారిని, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన వారిని పట్టించుకునే దిక్కే లేదనే టాక్‌నడుస్తోందట. వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రతిపక్షపార్టీగా టిడిపి ఇక్కడ ఎలాంటి ఉనికి చూపెట్టలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలు నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ప్రజల్లో ఉంటే.. టీడీపీ నేతలు అసలిదేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై పార్టీ శ్రేణుల్లో చాలా అసంతృప్తి పెరుగుతోంది. ఇన్ని రోజులు పదవులు అనుభవించి.. కింది స్థాయి నుంచి ఎదిగిన వారు.. పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు పట్టించుకోకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొంత కాలంగా కొత్త నాయకత్వం కావాలనే వాదనలు కూడా మొదలయ్యాయి. 

ఇదే సమయంలో టిడిపి పార్లమెంట్ ఇన్ ఛార్జులను నియమించింది. ఈ సారి కచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇచ్చి పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొస్తారని భావించారు. కానీ, మళ్లీ పాత కాపులకే పట్టం కట్టారు. నిన్నటి వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పార్థసారధి ఉన్నారు. మళ్లీ ఆయనకే హిందూపురం బాధ్యతలు అప్పజెప్పారు. ఇక పోలిట్ బ్యూరో సభ్యులుగా కాలువ శ్రీనివాసులుకు అనంతపురం బాధ్యతలు అప్పజెప్పారు. పార్టీలో ఇద్దరు సీనియర్లే.. వీరిపై వ్యక్తిగతంగా ఎవరికీ ఇబ్బంది లేదు. కాని కొత్త వారికి ఇచ్చి ఉంటే... పార్టీలో మార్పు కనిపించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

అయితే ఇక్కడ అధినేత వ్యూహం ఇంకోలా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా రెండు పార్లమెంటుల్లోనూ బీసీలకే ఎంపీ స్థానాలు కేటాయించింది. హిందూపురంలో కురుబలు ఎక్కువగా ఉండటంతో గోరంట్ల మాధవ్ కు, అనంతపురం పార్లమెంట్ లో బోయలు ఎక్కువగా ఉండటంతో తలారి రంగయ్యకు ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఈ ఫార్ములా గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు ఎంపీ సీట్లు తన్నుకపోయింది. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రకారం కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్థసారధికి, బోయ సామాజిక వర్గానికి చెందిన కాలువకు ఇన్ ఛార్జులు ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే ఈ ఫార్ములా బాగానే కనిపిస్తున్నా, కొందరు క్యాడర్ కు అంతగా రుచించడం లేదన్న టాక్ నడుస్తోంది. అదే కొత్త వారికి  అవకాశం ఇచ్చి ఉంటే...కేడర్ లో కాస్త ఉత్సాహం వచ్చేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయట.  ఈ పరిస్థితుల్లో పాత కాపులు ఏ మేరకు రాణిస్తారో, అధినేత ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి..