బాలయ్య సలహాను పాటిస్తున్న చంద్రబాబు !

బాలయ్య సలహాను పాటిస్తున్న చంద్రబాబు !

ఏపీ టీడీపీ కొత్త కమిటీ ప్రకటన ఎందుకు ఆగింది? అంతా సిద్ధమైనా అధినేత ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నాన్చుడుపై విమర్శలు వస్తున్నా చంద్రబాబు వెయింటింగ్‌కు కారణం ఏంటి? కమిటీల ప్రకటన బాలకృష్ణ వల్లే ఆగిందా? బాలయ్య చెబితే బాబు విన్నారా? ఇంతకీ ఈ లేట్‌కు రీజన్‌ ఏంటి?

టీడీపీ కమిటీలపై చంద్రబాబు 6 నెలలుగా కసరత్తు!

ఏపీ టీడీపీ పార్లమెంట్ నియోజవర్గాల అధ్యక్షుల ప్రకటన పూర్తి అయింది. రాష్ట్ర కమిటీ ప్రకటన మాత్రం రేపు మాపు అంటూ నాన్చుతున్నారు. పార్టీలోఈ నాన్చుడు కొత్తది కాకపోయినా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇంత నాన్చుడు, ఇంత లాగ్‌ అవసరమా అని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నాయకులు. దాదాపు 6 నెలల సుదీర్ఘ కసరత్తుతో చంద్రబాబు ఈ కమిటీలను ఫైనల్ చేశారు. సామాజిక సమీకరణలు, యువరక్తాన్ని మేళవించారట. గతనెల నుంచి ప్రతివారం ఇదిగో ప్రకటన.. అదిగో ప్రకటన అని ప్రచారం జరుగుతుంది తప్ప.. లిస్ట్ మాత్రం విడుదల చేయడం లేదు అధినేత.

బాలయ్య సూచనతో కమిటీ ప్రకటన ఆగిందా? 

చంద్రబాబు ప్రకటన చేయకపోవడానికి కారణం ఎమ్మెల్యే బాలయ్యే అట. బావమరిది సూచన మేరకే రాష్ట్ర కమిటీ ప్రకటన ఆగిందని ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతుంది. సాధారణంగా పార్టీ కమిటీలు, కార్యక్రమాల విషయంలో బాలకృష్ణ పెద్దగా కలుగజేసుకోరు. కమిటీలో ఎవరైన తన మనిషికి ఏదైనా పోస్టు ఇవ్వాలి అనుకుంటే.. ఒక చిన్న సూచన చేస్తారు. అంతేగాని రోజూ వారీ వ్యవహారాల్లోనో.. ఇతర కీలక నిర్ణయాల్లోనో పెద్దగా జోక్యం చేసుకోరు. ఇదే సమయంలో బాలయ్య అడిగితే చంద్రబాబు కాదని చెప్పింది లేదు.

ఈ నెల 18  తర్వాత కమిటీపై ప్రకటన చేయాలన్నారట!

అయితే కమిటీ ప్రకటన ఇప్పుడే వద్దని చెప్పారట బాలకృష్ణ. ఈ నెలలో ఇప్పట్లో మంచి రోజులు లేవని సూచించారట. అంతకూ ఇవ్వాలి అని అనుకుంటే ఈ నెల 18 తరువాత కమిటీపై ప్రకటన చేయాలన్నారట. దీంతో అసలే టైమ్‌ బాగోలేదు.  ఎంత చేసినా ప్రతిపక్షంలో కూర్చోక తప్పలేదు.  అది చాలదన్నట్టు ఎమ్మెల్యే వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకైనా మంచిదనుకున్నారో ఏమో బాలయ్య సలహాని తూచా తప్పకుండా పాటిస్తున్నారు చంద్రబాబు. కమిటీ అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేశారట. 

ఇప్పుడు మంచి ముహూర్తం కోసం వేచి చూస్తోన్న అధినేత!

టీడీపీ విపక్షంలోకి వచ్చాక వాస్తు వ్యవహారాలు, మంచి రోజులు చూసుకునే విధానం బాగా ఎక్కువైందట. దీనిపై పార్టీ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల నియామకాన్ని కూడా ముహూర్తం చూసుకుని 11 గంటల 50 నిముషాలకు విడుదల చేశారు. ఇప్పుడు రాష్ట్ర కమిటీ విషయంలోనూ మంచి ముహూర్త కోసం వేచి చూస్తోంది అధిష్ఠానం. దీనికి తోడు స్వయంగా బాలయ్య మంచిరోజుపై సూచన చేయడంతో కమిటీ ప్రకటన మళ్లీ వాయిదా పడిందని చెబుతున్నారు. 

ముహూర్తాలు, పూజల విషయంలో బాలయ్య కచ్చితంగా ఉంటారు!

ముహూర్తాలు.. పూజల విషయంలో బాలయ్య చాలా పక్కాగా ఉంటారు.  అది షూటింగ్‌ అయినా.. మరే కార్యక్రమం అయినా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. చేతికి మెడలో అనేక దేవుళ్లకు సంబంధించిన తాళ్లు ఉంటాయి. అందుకే బాలయ్య చెప్పిన దానికి ఈ సందర్భంగా ప్రాధాన్యం ఇచ్చారట. అసలే ప్రతిపక్షంలో ఉన్నాం.. అధికారపార్టీ ఇబ్బంది పెడుతోంది. కాస్త ముహూర్తం చూసుకుని ప్రకటనలు చేస్తే మంచిది అని బాలయ్య అన్నారట. మరి.. ఈ ముహూర్తాలు, మంచి రోజులు టీడీపీలో ఎంత ప్రభావం చూపుతాయో అన్న చర్చ మొదలైంది. ఏదిఏమైనా నందమూరి వారు... బావా ఆగాగు అనగానే... వెనక్కి తగ్గారు నారా వారు అనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.