ఏపీలో టీడీపీ వర్సెస్‌ పోలీస్‌ ఫైట్‌ నడుస్తోందా?

ఏపీలో టీడీపీ వర్సెస్‌ పోలీస్‌ ఫైట్‌ నడుస్తోందా?

ఏపీలో టీడీపీ వర్సెస్‌ పోలీస్‌ ఫైట్‌ నడుస్తోందా? రోజూ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్‌ చేయడం వెనక టీడీపీ ఆలోచన ఏంటి? చంద్రబాబుకే నోటీస్‌ ఇవ్వడంలో పోలీస్‌శాఖ వ్యూహం ఏంటి? గతంలో ఎప్పుడూ లేనిది పోలీసులు ఎందుకు రాజకీయ విమర్శలపై స్పందిస్తున్నారు? లెట్స్‌ వాచ్‌.
 
గతంలో రోడ్డెక్కి నిరసన తెలిపిన చంద్రబాబు!

ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని నిత్యం విమర్శలు చేస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు పోలీస్‌ శాఖను వదిలిపెట్టడం లేదు.  ప్రెస్‌మీట్లు, లేఖలతో డిపార్ట్‌మెంట్‌లోని పెద్దలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.  ఏడాదిగా ఇది కొనసాగుతూనే ఉంది.  పల్నాడులోని ఆత్మకూరు నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీకి అండగా పోలీసులు చెలరేగిపోతున్నారన్నది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇదే అంశంపై గతంలో చంద్రబాబు రోడ్డెక్కి నిరసనలు కూడా తెలిపారు. స్వయంగా డీజీపీ ఆఫీసు ఎదుట బైఠాయించారు.  తరచూ డీజీపీ, ఎస్పీలకు లేఖలు రాస్తున్నారు. 
 
భిన్నమైన లైన్‌ తీసుకున్న ఏపీ పోలీసులు!

అయితే టీడీపీ తీరు పోలీస్‌ శాఖకు ఇబ్బందిగా మారిందని టాక్‌.  ఒక కేసు కాకపోతే మరో కేసులో అయినా ఉన్నతాధికారులు స్పందించాల్సి వస్తోంది. వాస్తవాలు ఎలా ఉన్నా ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‌ వెళ్తోందని పోలీస్‌ పెద్దలు భావిస్తున్నారట. సాధారణంగా పోలీసులపైనా.. పోలీస్‌ శాఖపైనా రాజకీయంగా చేసే ఆరోపణలను పెద్దగా పట్టించుకోరు.  కాకపోతే ఈ టార్గెట్లకు ముగింపు లేకపోవడంతో పోలీస్‌ బాస్‌లు భిన్నమైన లైన్‌ను తీసుకున్నారు. 
 
చంద్రబాబుకు డీజీపీ లేఖ రాయడంపై చర్చ!

చట్టపరిధిలోనే టీడీపీ ఆరోపణలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. ఆ మధ్య పోన్‌ ట్యాపింగ్‌పై ప్రధాని మోడీకి లేఖ రాశారు చంద్రబాబు. దీనిపై రాజకీయ పక్షాలతోపాటు పోలీస్‌ శాఖ కూడా స్పందించింది.  స్వయంగా డీజీపీ గౌతం సవాంగ్‌ టీడీపీ అధినేతకు లేఖ రాసి.. ఫోన్‌ ట్యాపింగ్‌పై సాక్ష్యాలుంటే అందజేయాలని కోరారు.  ఈ విధంగా చంద్రబాబుకు DGP లేఖ రాయడం శాఖా పరంగానే కాకుండా రాజకీయంగానే చర్చకు కారణమైంది. గౌతం సవాంగ్‌ రాసిన లేఖలో తప్పుల్లేవని.. ఉన్నత స్థానాల్లో ఉండి ఆరోపణలు చేసినప్పుడు సాక్ష్యాలు అడగడం తప్పు కాదని డిపార్ట్‌మెంట్‌ వాదన. దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని అంటున్నారు. అయితే ఈ లేఖపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపైనే తమకు అనుమానాలుంటే.. తాము ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించింది. ప్రధానికి లేఖ రాస్తే డీజీపీ జోక్యం చేసుకోవడం ఏంటన్నది తమ్ముళ్ల అభ్యంతరం.
 
ఆరోపణలపై సమాచారం కోరిన పోలీసులు!

ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్‌ అనే యువకుని మృతిపై  చంద్రబాబు, టీడీపీ నేతలు  తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం ధరలను ప్రశ్నించడం వల్లే చనిపోయాడన్నది తెలుగుదేశం ఆరోపణ.  మృతుని ఫోన్‌ను స్థానిక పోలీసులు తీసుకెళ్లారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నీ పోలీసులు సీరియస్‌గానే తీసుకున్నారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. చేసిన ఆరోపణలపై ఉన్న సమాచారం అందజేయాలని కోరారు. దర్యాప్తునకు ఆ సాక్ష్యాలు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. దీంతో విచారణ కోరితే తమకే నోటీసు ఇస్తారా అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే నోటీసులు, కౌంటర్‌ లేఖలు ద్వారా అధికార పరిధిలో వ్యవహరిస్తే విమర్శలను  కట్టడి చేసేందుకు వీలుకలుగుతుందనే అభిప్రాయంలో ఉందట పోలీస్‌శాఖ. మరి టీడీపీ, పోలీసు శాఖ మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.