చెలమలశెట్టి సునీల్‌ వైసీపీలో చేరడం ఎందాకా వచ్చింది ?

చెలమలశెట్టి సునీల్‌ వైసీపీలో చేరడం ఎందాకా వచ్చింది ?

ఎంపీ కావాలనే లక్ష్యంతో మూడు పార్టీలు మారినా ఆయన ముచ్చట తీరలేదు. ఎన్నికల్లో పోటీ కలిసి రావడం లేదని అన్నుకున్నారో ఏమో.. ఈసారి రూటు మార్చారట. YCPలో చేరడం ఖాయం అంటున్నారు. వచ్చే వారం ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు చెబుతున్నారు. 
 
రాజకీయ సమీకరణాలను సరిగా అంచనా వేయలేకపోయారా? 

చెలమలశెట్టి సునీల్ ఈ పేరు రాష్ట్రంలో చాలా మందికి పరిచయమే. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో అయితే  తెలియని వారే లేరు. ఆర్థిక, అంగబలం దండిగా ఉన్న సునీల్‌కు ప్రత్యక్ష ఎన్నికలు కలిసి రాలేదు. ఇప్పటి వరకూ  ముడు దఫాలుగా కాకినాడ పార్లమెంట్ స్థానానికి వివిధ పార్టీల తరఫున పోటీ చేసినా ఒక్కసారి కూడా  గెలవలేక పోయారు. రాజకీయ సమీకరణలను  సరిగా అంచనా వేయలేక పోటీ చేసిన ప్రతీసారీ అపజయం పాలయ్యారు.
 
2009లో పీఆర్పీ, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పోటీ!

2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా బరిలో దిగారు సునీల్‌.  రాజకీయాల్లో సునీల్‌ అంత దురదృష్టవంతుడు లేరంటారు. ఇప్పుడు మరోసారి అధికార పార్టీ నీడన చేరి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్న తన చిరకాల కోరిక నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఢిల్లీలో కీ రోల్‌ పోషించాలన్నది ఆయన బలమైన కోరికగా చెబుతున్నారు.  దీనికి సీఎం జగన్‌ పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయినట్లు సమాచారం. సునీల్ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ కావడంతో పార్టీకి ఉపయోగ పడతారని అనుకుంటున్నారట. 
 
2022లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి సునీల్‌కు ఇస్తారా?

2022లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి కాపు సామాజిక వర్గానికి ఇవ్వమని జగన్‌ భావిస్తున్నారట.  ఆ సీటును సునీల్‌కు ఇవ్వడానికి సీఎం జగన్‌ ఓకే చెప్పేశారని అనుకుంటున్నారు. ఒప్పందం కుదరడంతో త్వరలో తన బలంగంతో సునీల్‌ వైసీపీలో చేరడానికి  రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
బలమైన కాపు సామాజికవర్గం నేతలపై వైసీపీ కన్ను!

వైసీపీలో సునీల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయట. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు  సునీల్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయట. ఒకవేళ టీడీపీలోనే  కొనసాగితే.. ఆ పార్టీని ఆర్థికంగా ఆయన అండగా ఉండే వీలుంటుంది. అందుకే సునీల్‌ను వైసీపీలో చేర్చుకుంటే.. ప్రత్యర్థులు బలపడకుండా చేయవచ్చని వైసీపీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారట. ఈ సమీకరణాలే  సునీల్‌ రీఎంట్రీకి ఓకే చేశాయట. కాపు ఓటు బ్యాంకు కోసం బీజేపీ, జనసేన పావులు కదుపుతుండటంతో.. ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నేతలకు వైసీపీలో పెద్ద పీట వేయబోతున్నారట. బీసీలతో సమాన అవకాశాలు కల్పిస్తే.. శత్రువులను దెబ్బకొట్టే వ్యూహంతో ముందుకెళ్లాలనే  వ్యూహంలో భాగంగానే సునీల్‌ను చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. ఎవరి వ్యూహం ఎలా ఉన్నా.. ఈ దఫా అయినా ఎంపీ కావాలనే సునీల్‌ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.