తెలకపల్లి రవి: కేంద్రం జిఎస్‌టి బురిడీ, అప్పుల ఆప్షన్స్‌ గారడీ

తెలకపల్లి రవి: కేంద్రం జిఎస్‌టి బురిడీ,  అప్పుల ఆప్షన్స్‌ గారడీ

తెలకపల్లి రవి

గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జిఎస్‌టి- సరుకులు సేవల పన్ను) పేరిట దేశమంతటా ఒకే విధమైన పన్ను విధానం ప్రవేశపెట్టాలని కేంద్రం తొందరపెట్టినప్పుడు చాలా రాష్ట్రాలు తమ ఆదాయం పడిపోతుందని గగ్గోలు పెట్టాయి. అయితే ఆ లోటు మేము భర్తీ చేస్తామని కేంద్రం గంభీరంగా హామీ ఇచ్చింది. అంతకు ముందే నోట్ల రద్దు దెబ్బతో విలవిలాడుతున్న రాష్ట్రాల పై తర్వాత ఆర్థిక మందగమనం వచ్చి పడింది. వీటన్నిటినీ మించి కరోనా తాకిడి అతలాకుతలం చేసింది.

ఆరోగ్యరంగంలో ప్రజలకు ప్రత్యక్ష బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలను నామమాత్రం చేసి మోడీ సర్కారు వ్యక్తిగతంగా ప్రధాని లాక్‌డౌన్ లు అన్‌లాక్ లు అన్నీ ఆదేశాలు జారీ చేస్తూ వెళ్లారు, ఆర్థిక వ్యవస్థ కొడిగట్టి పోయింది. ఉత్పత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని దెబ్బతిన్నాయి. రాష్ట్రాల ఆదాయం ఘోరంగా దెబ్బతిన్నది. ఇంత జరుగుతున్నా ఒక్కసారి కూడా ఆర్థిక మంత్రుల సమావేశం జరపకుండా తమ చిత్తానుసారంప్యాకేజీ ప్రహసనాలను సాగించారు. ఇందులోనూ రాష్ట్రాలకు ఇచ్చింది శూన్యహస్తమే. ఒక దశలో మాత్రం తొమ్మిది వేల కోట్ల మేరకు తమ విచక్షణ మేరకు అన్ని రాష్ట్రాకు కలిపి సహాయం అందించారు. కానీ అది ఒక్క తెలంగాణకు లేదా కేరళలకు రావలసిన దాంతో సమానం. ఎట్టకేలకు గురువారం నాడు  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ రాష్ట్రామంత్రులతో చర్చ జరిపి రెండు ఆప్షన్‌లు ఇచ్చినట్టు మీడియాకు చెప్పారు.  అప్పులు ఎలా తెచ్చుకుని ఎలా తీర్చుకుంటారనేది మినహా ఇందులో మరేమీ లేదు. ఈ క్రమంలో రాష్ట్రాలలోటును కరోనా తాకిడికి ముందు, తర్వాత  రెండుగా విభజించి చూపించారు.

రాష్ట్రాలకు మొత్తం లోటు మూడు లక్షల కోట్లు. ఇందులో  తొంభై మూడు వేల కోట్లు మాత్రమే సహజంగా వచ్చింది. తక్కిన లోటు కరోనా వల్ల అంటే దైవాధీనకారణంగా సంభవించింది.  ఈ మూడు లక్షల కోట్లలోనూ 70 లక్షల కోట్లవరకూ సెస్‌ ద్వారా వస్తుంది. మిగిలింది 2.35 లక్షల కోట్లు. దీన్నిరెండుగా విభజించి సగం కేంద్రం సగంరాష్ట్రాలకు అప్పుగా తీసుకోవడం ఒక మార్గమట. ఆ విధంగా తీసుకోవడానికి గాను వాటి ద్రవ్యలోటు పరిమితిని పెంచి అప్పు తీసుకోవడానికి అనుమతిస్తారు. కానీ 25శాతం పెంచాల్సి వుండగా 17 శాతం మాత్రమే పెంచుతారు. ఈ పద్దతిలో రాష్ట్రాలకు యాభైవేల కోట్లు నష్టం వస్తుంది. ఇక మొత్తం రాష్ట్రాలే తీసుకోవడం రెండవ మార్గమట. మొత్తం పన్నులు  పోను జిఎస్‌టి లోటు 2.7క్ష కోట్లు రాష్ట్రాలే సమకూర్చుకోవచ్చు. ఆమేరకు వాటికి  అదనపు ద్రవ్యలోటు 1.5 పరైంటైల్‌ పాయింట్స్‌  ఇవ్వాలి.  కానీ దీనికింద  నిర్దిష్టంగా ఎంత మొత్తం ఇస్తామనేది చెప్పడం లేదు. ఇవి రెండు ఆప్షన్స్‌ అని ఏదో ఒకటి ఎంచుకోవాని నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. ఈ రెండు పద్దతులోనూ రాష్ట్రాలు తమకు రావలసిన పరిహారం కొంత వదుకోవసిందేనని కేరళ ఆర్థిక మంత్రి  థామస్‌ ఐజాక్‌ స్పష్టం చేశారు.

వాస్తవానికి కరోనాకు ముందే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగావుంది. రాష్ట్రాలు అప్పుభారంలో కూరుకుపోయాయి. తర్వాత వాటి భారం మరింత పెరిగింది. కేంద్రం ఆదుకోకుండా  దైవనిర్ణయం మీ తిప్పలు మీరే పడాలనడం ఏం న్యాయం? అదే కాలంలో ఒక్క పెట్రోలియం మీదనే కేంద్రానికి పద్దెనిమిది లక్షల కోట్లు మిగిలాయి. ఇందులో రెండున్నర లక్షల కోట్లు లెక్కలోవే కావు. అయిదేళ్ల పాటు లోటు భర్తీ చేస్తామని రాజ్యాంగబద్దంగా రాష్ట్రాకు ఇచ్చిన హామీ. ఈ కాలంలోనే ప్రభుత్వం రిజర్వు బ్యాంకు దగ్గర మూడు సార్లు లక్షల కోట్లు తీసుకుంది. రాష్ట్రాలు మాత్రం అప్పులు తీసుకుని అయిదేళ్ల తర్వాత  కట్టడం మొదలుపెట్టాలి. వాస్తవానికి మైనస్‌లో నడుస్తున్న ఆర్థికాభివృద్ధి మరో అయిదారేళ్ల వరకూ పట్టాలెక్కే ఆశేలేదు. మరి రాష్ట్రాలకు ఆదాయం ఎలా పెరుగుతుంది? అప్పులు ఎలా తీర్చగలుగుతాయి? కరోనాను  ఎదుర్కొవడానికి కూడా కేంద్రం నుంచి నిర్దిష్ట సాయం అందింది నామమాత్రం. ఇప్పుడు దయ చూపి అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తానడం పెద్ద ఆఫ్షనా? ఆ బావిలో దూకుతారో ఈ చెరువులో దూకుతారో మీ ఇష్టం అనడం ఏం సాయం? ఏం న్యాయం? ప్రజలకిచ్చిన వాగ్దానాల మాట అటుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన హామీనే ఉల్లంఘిస్తే దాని మివేమిటి? పైగా ఇదేదో బిజెపియేతర ప్రభుత్వా రాజకీయ కుట్రలాగా చిత్రించడం మరింత పొరబాటు. ఏ రాష్ట్రం ఏ పార్టీ పాలనలో వున్నా రాజ్యాంగ రీత్యా దేశం రాష్ట్రాల సమాఖ్య అన్నది రెండవ అధికరణం చాటుతున్న సత్యం. వాటి పట్ల  కేంద్రం బాధ్యత నిర్వహించవలసిందే. ఈరోజు కరోనా కావచ్చు రేపు కరువులు వరదలు మరేనా కావచ్చు, దైవ నిర్ణయం అంటే చెల్లుతుందా?