తెలకపల్లి రవి: మూడు రాజధానులపై జగన్‌తోనే కేంద్రం

తెలకపల్లి రవి: మూడు రాజధానులపై జగన్‌తోనే కేంద్రం

తెలకపల్లి రవి

ఏపీ హైకోర్టులో కేంద్ర హోం శాఖ మూడోసారి దాఖలు చేసిన అఫిడవిట్‌ మూడు రాజధానులకు అనుకూలంగా  మరో అడుగేసింది. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని తమకు సంబంధం లేదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన కేంద్రం ఈ సారి మూడు రాజధానులు వుండకూడదని ఎక్కడా లేదని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 13లో క్యాపిటల్‌ అని వుంది గనక ఒకే రాజధాని వుండాని యనమల రామకృష్ణుడు వంటి వారు కొందరు న్యాయవాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది.

కేంద్ర శాసనలో ఏకవచనం వున్నా బహువచనంగా కూడా తీసుకోవాలనీ, పుంలింగం వాడినా స్త్రీలకూ వర్తించేదిగా వుంటుందని 1897 కేంద్రశాసనాల పరిభాష చట్టం సెక్షన్‌ 13 స్పష్టం చేస్తున్నట్టు హోం శాఖ సహాయ కార్యదర్శి లలిత కె.హోడీ కోర్టుకు తెలిపారు. ఒకే రాజధాని అన్నా అది అమరావతి మాత్రమేనని చెప్పడానికి లేదన్నది. రాజ్యాంగం మూడవ అధికరణం రాష్ట్రాల ఏర్పాటు గురించి చెబుతున్నదే గాని రాజధానుల ప్రసక్తి తీసుకోలేదని గుర్తు చేసింది. గతంలో కేంద్రం ఏపీ రాజధానికి నిధులు ఇవ్వడం, రిజర్వు అడవులను అప్పగించడం వంటి పనులు మాత్రమే చేసింది తప్ప అమరావతి నిర్ణయం తమది కాదని కూడా హోం శాఖ తెలిపింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రస్తావించడాన్ని కూడా హోం శాఖ తోసిపుచ్చింది. హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు ఇవ్వడం రాజధానిగా చెప్పడం కాదు. ఎందుకంటే రాజధానిలోనే హైకోర్టు ఉండాలని ఎక్కడా లేదు. మార్చకూడదనీ లేదు కనుక ఈ ఉత్తర్వులను బట్టి మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పడం చెల్లదని హోం శాఖ తెల్పింది. మొత్తంపైన అన్ని కోణాల్లోనూ జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలకు తమ అభ్యంతరం లేకపోగా ఆశీస్సులు కూడా వున్నాయని కేంద్రం చెప్పడం కొందరు ఇప్పటివరకూ చేస్తున్న ప్రచారాలకు భిన్నంగా వుంది. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక వెనక్కు తగ్గక పోవచ్చు.

ఇక ఉన్నత న్యాయస్థానం విచారణే అంతిమం కానుంది. దాని తీర్పు వచ్చాక సుప్రీం కోర్టుకు వెళ్లడం ఎలాగూ జరుగుతుంది. కనక కేంద్రం ఏం చెప్పినా రాజధాని వ్యవహారం దీర్ఘకాలం కొనసాగవచ్చు. లేక ఈ అఫిడవిట్‌ తర్వాత తొందరగా ముగిద్దామనీ అనుకోవచ్చు. మూడు సార్లు కేంద్రం సానుకులంగా స్పందించిన ప్రభావం కోర్టు నిర్ణయంపైనా వుండొచ్చు. పార్లమెంటు శాసనం,  శాసనసభ బిల్లు రెంటినీ కాదని కోర్టు ఈ నిర్నయానికి వ్యతిరేకంగా ఆదేశాలిస్తే అది పెద్ద ముప్పే  అవుతుంది. గతంలో సిఆర్‌డిఎ కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవించడం రైతుకు న్యాయం చేయడం వంటి అంశాలపై కోర్టు కేంద్రీకరించవచ్చు. బయట రాజకీయ పార్టీలు వ్యవహరించే తీరు కూడా పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. రాజధాని విషయంలో వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ వ్యతిరేకమని అంటున్నా అనేక కారణాల వల్ల తెలుగుదేశం ప్రధాన పాత్ర వహించడం వల్ల అమరావతిలో నిరసన ఉద్యమం కొన్నిపరిమితులోనే కొనసాగుతున్నది. జెఎసి అద్యక్షుడుగా వున్న హిందూ మహాసభ అద్యక్షుడు జివిఆర్‌శాస్త్రి వంటివారు తాము ప్రధాని కార్యాయంతో మాట్లాడుతున్నట్టు మార్పులు ఆగిపోవడం అనివార్యమైనట్టు చెబుతూ వచ్చారు. కాని సోము వీర్రాజు అద్యక్షుడైన తర్వాత ఇప్పటికే రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని చెప్పేశారు.హోం శాఖ అఫిడవిట్‌ వాటన్నిటికీ తెర దించిందని చెప్పాలి. బిజెపి కూడా ఇక ద్వంద్వ భాషణం చేసే అవకాశం లేకపోవచ్చు.