విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం కీలక ప్రకటన

విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం కీలక ప్రకటన

 కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.