లాఠీఛార్జీ అంటూ నకిలీ వీడియోలు.. రిపోర్టర్‌పై కేసు

లాఠీఛార్జీ అంటూ నకిలీ వీడియోలు.. రిపోర్టర్‌పై కేసు

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వికృతరూపం ప్రదర్శిస్తోంది. మొదటి సారి కంటే రెండో విడతలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. దీనిని పోలీసులు బాధ్యతగా అమలు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ విషయంలో ఓ యూట్యూబ్ చానల్‌ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. హైదరాబాద్ రాత్రి కర్ఫ్యూ సందర్భంగా లాఠీఛార్జీ చేశారంటూ నకిలీ వీడియోను తమ చానల్‌లో పోస్టు చేశాడు. దీంతో సదరు రిపోర్టర్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. రాత్రి కర్ఫ్యూలో పోలీసులు లాఠీఛార్జీ చేశారని యూట్యూబ్‌లో నకిలీ వీడియో పోస్టు చేసిన రిపోర్టర్‌పై కేసు రిజిస్టర్ చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.