బీజేపీ సారధి బండి సంజయ్ కొత్త సవాళ్లను ఎదుర్కోగలరా?

బీజేపీ సారధి బండి సంజయ్ కొత్త సవాళ్లను ఎదుర్కోగలరా?

తెలంగాణ బీజేపీ సారథిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌ తొలిసారిగా ఎదుర్కోబోతున్న సవాళ్లు ఏంటి? ఆ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? పార్టీ రచిస్తున్న వ్యూహాలేంటి? అధికార పార్టీని ఢీకొట్టడం సాధ్యమేనా? 

కరోనా వల్ల సంజయ్‌ సామర్థ్యం అంచనాలకు అందలేదా?

ఈ ఏడాది మార్చిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌.. కరోనావల్ల భారీ కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. ఇటీవలే దూకుడు పెంచారు.  జిల్లాలను చుట్టేస్తున్నారు. తాజాగా విమోచన దినోత్సవం పేరుతో యాత్ర చేపట్టారు. సంజయ్‌ హిందూ వాదాన్ని బలంగా వినిపిస్తారనే కారణంతో.. ఆయనైతే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఢిల్లీ పెద్దలు భావించారు. అయితే కరోనా వల్ల సంజయ్‌ సామర్థ్యం ఏంటో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.

వరుస ఎన్నికలను ఫేస్‌ చేయబోతున్న సంజయ్‌!

బండి సంజయ్‌కు అసలు సిసలు పరీక్ష త్వరలో ఎదురు కాబోతోంది. వరుస ఎన్నికలను ఆయన ఫేస్‌ చేయబోతున్నారు. అవి కూడా ఒకే రకమైన ఎలక్షన్స్‌ కావు. ఒకటి అసెంబ్లీ  మరికొన్ని ఎమ్మెల్సీ.. ఇంకొన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు. బీజేపీకి ఏ మాత్రం బలం ఉందో.. క్షేత్రస్థాయిలో ఎంతటి పట్టు ఉందో ఈ ఎన్నికలతో తేటతెల్లం కానుంది. GHMC ఎన్నికల్లో బీజేపీ  జెండా ఎగరాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిర్దేశించారు. అలాగే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ శాసనమండలి స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచేలా తగిన వ్యూహరచనతో ముందడుగు వేయాలన్నారు. 

ముందుగా దుబ్బాక ఉప ఎన్నికతో సవాళ్లు షురూ!

వీటన్నింటికంటే ముందు దుబ్బాక ఉపఎన్నిక రానుంది. దుబ్బాకలో పోటీకి బీజేపీ సై అంటోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కమలనాథులు.. ఇక్కడ ఏ మేరకు సత్తా చాటుతారో చూడాలి. సంజయ్‌ ఎన్నికల వ్యూహానికి ఇది తొలిపరీక్ష కాబోతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సమరంలో పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పటికి సంజయ్‌ సారథిగా రాలేదు. మరి.. ఇప్పుడేం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. 

జీహెచ్‌ఎంసీ పోరులో సంజయ్‌ వ్యూహం ఎలా ఉంటుంది?

దుబ్బాక తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గ్రేటర్‌ ఎన్నికలు  బీజేపీకి సెమీఫైనల్‌ వంటివని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లక్ష్మణ్‌ అంటూ ఉండేవారు. మరి.. బండి సంజయ్‌ కెప్టెన్సీలో ఏమౌతుందన్నది ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 150 డివిజన్లు ఉన్న GHMCలో బీజేపీకి ఐదుగురు కూడా కార్పొరేటర్లు లేరు. పైగా పార్టీ ముఖ్యనేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటారు. అలాగే గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు కూడా సన్నద్ధం కావాల్సి ఉంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావాలంటే ఈ ఎన్నికల్లో  బలం చాటుకోవాలి. 

మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు!

ఇక మార్చిలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిల్లో ఒకటి బీజేపీ ఖాతాలో ఉంది. దానిని నిలబెట్టుకోవడంతోపాటు.. మరో స్థానంలో ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది సంజయ్‌ నాయకత్వంపై ఆధారపడి ఉంది. అందుకే బీజేపీ కొత్త సారథి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.