చిత్తూరు జిల్లాలో టెన్షన్ రేపుతున్న బులెట్ దొంగలు !

చిత్తూరు జిల్లాలో టెన్షన్ రేపుతున్న బులెట్ దొంగలు !

చిత్తూరు జిల్లా తిరుపతి,చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. బుల్లెట్ బైక్ లను టార్గెట్ చేసి రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటివరకు 9 బుల్లెట్ బైకులు మాయం చేశారు కేటుగాళ్ళు. గత వారం తిరుపతి రూరల్ మండలంలోని విద్యానగర్,పాత కాల్వ,పుదిపట్ల గ్రామాల్లో 7 బుల్లెట్ బైకులు మాయం చేసిన దొంగలు ఇవాళ చంద్రగిరిలో రెండు బైకులు అపహరించారు. విజయనగర్ కాలనీకి చెందిన సలీం ఉల్లా ఇంటి వద్ద పార్క్ చేసిన బైకును అలాగే పాతపేటలో మరో బైకును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుస దొంగతనాలతో వాహనదారులను కలవరపాటుకు గురవుతున్నారు. తిరుపతి రూరల్ లో సీసీ టీవీ ఫుటేజ్ దొరకగా దాని ఆధారంగా అక్కడి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రగిరిలో మాత్రం సీసీ టీవీలు లేకపోవడంతో చంద్రగిరి పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ప్రధాన కూడళ్లలో ఎక్కడా ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.