చైనాలో మరో కొత్త మహమ్మారి... బయోఫార్మా కంపెనీ నుంచి లీక్... 

చైనాలో మరో కొత్త మహమ్మారి... బయోఫార్మా కంపెనీ నుంచి లీక్... 

చైనా అంటేనే ఇప్పుడు ప్రపంచం యావత్తు భయపడుతున్నది.  చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది.  కరోనా నుంచి ఇంకా ప్రపంచం కోలుకోలేదు.  ఎప్పటి వరకు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి.  కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు అనేక ఫార్మా కంపెనీలు, దేశాలు వాక్సిన్ ను తయారు చేసే పనిలో మునిగి ఉన్నాయి.  ఈ సమయంలో చైనానుంచి వస్తున్న ఓ వార్త ప్రపంచాన్ని భయపెడుతున్నది.  

చైనాలో మరో కొత్త మహమ్మారి విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.  వాయువ్య చైనాలోని గాన్సు ప్రావిన్స్ లోని  లాంజౌ నగరం కేంద్రంగా బ్రుసెల్లోసిస్ వ్యాధి విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది.  3,245 మంది ఈ వ్యాధి బారిన పడినట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ లాంజౌ పేర్కొన్నది.  బ్రుసెల్లా అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణం అని తెలుస్తోంది.  ఈ వ్యాధి మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా సోకుతుంది.  ఈ వ్యాధి సోకిన జంతువులను తాకడం, సరిగా వండని మాంసం తీసుకోవడం, సరిగా శుద్ధిచేయని పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, కలుషితమైన గాలిని పీల్చడం వలన ఈ వ్యాధి సోకుతుందని నిపుణులు చెప్తున్నారు.  జాంగ్మూ లాంజౌ బయోఫార్మా కంపెనీ నుంచి ఈ బ్యాక్టీరియా బయటకు లీకైనట్టు అధికారులు చెప్తున్నారు.  బ్రుసెల్లస్ వ్యాధికి టీకాను తయారు చేసేందుకు చేస్తున్న పరిశోధన సమయంలో ఈ బ్యాక్టీరియా బయటకు లీకైనట్టు సమాచారం.  అయితే, లీకైన బ్యాక్టీరియాను నిర్మూలించే సమయంలో తగిన ప్రమాణాలు పాటించకపోవడంతో ఇది ఇతరత్రా ప్రాంతాలకు వ్యాపించినట్టు సమాచారం.  ఈ బ్యాక్టీరియా కరోనా వైరస్ కంటే సున్నితమైనదని, చాలా వేగంగా విస్తరిస్తుందని అధికారులు చెప్తున్నారు.