యువతి గొంతుకోసి హత్య.. ఆపై

యువతి గొంతుకోసి హత్య.. ఆపై

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బాపూజీ కాలనీలో ఉంటున్న యువతిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంకు చెందిన ఆళ్ల కిరణ్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. బాపూజీ కాలనీ చెందిన లహరి జంగారెడ్డిగూడెం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలో పనిచేస్తుంది. కొంతకాలం క్రితం లహరి, కిరణ్ కు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి లహరిని ప్రేమించమని కిరణ్ వెంటపడుతున్నాడు. లహరి కిరణ్ ప్రేమను తిరస్కరించింది.

అయినా కూడా కిరణ్ అలానే వెంటపడుతుండంతో.. లహరి కుటుంబ సభ్యులు కిరణ్ ను మందలించారు. చివరికి లహరి కుటుంబ సభ్యులు పోలవరానికి చెందిన సతీశ్‌ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్ మంగళవారం రాత్రి లహరి ఇంటికి వచ్చి.. తన ప్రేమను నిరాకరిస్తావా అని దుర్భాషలాడాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో లహరి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతి లహరి కాసేపటికి మృతిచెందింది. ఘటనా స్థలం నుండి  పారిపోయిన కిరణ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.