దోస్తులుగా మారిపోయిన రాజకీయ శత్రువులు.!

దోస్తులుగా మారిపోయిన రాజకీయ శత్రువులు.!

ఆ ఇద్దరు బాల్య స్నేహితులు. ఒకేసారి రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్నారు. పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చాక వర్గపోరుతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు కూడా. అలాంటి నాయకులు ఇప్పుడు చెట్టపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారు. రాజకీయంగా కుస్తీ పట్టిన నాయకులు.. ఇప్పుడు దోస్త్‌ మేరా దోస్త్‌ అనడానికి దారి తీసిన పరిస్థితులేంటి? పార్టీలో.. ప్రజల్లో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? 

రాజకీయాల్లో  రెండువర్గాలుగా విడిపోయారు!

ఉత్తరాంధ్ర నుంచి రాజకీయాల్లోకి వచ్చి తలపండిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మంత్రి  బొత్స సత్యనారాయణ ఒకరు. ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్‌గా ఉన్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మరొకరు. ఇద్దరిదీ విజయనగరం జిల్లానే. పైగా చిన్ననాటి ఫ్రెండ్స్‌. రాజకీయాలలో దివంగత నేత పెనుమత్స సాంబశివరాజుకు వీర విధేయ శిష్యులు.  వీరభద్రస్వామిని ఎప్పుడూ పేరు పెట్టి కాకుండా చంటీ అని పిలుస్తారట బొత్స. అంతటి స్నేహం పెనవేసుకున్న బొత్స, కోలగట్లకు ఏమైందో ఏమో కానీ.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కేకొద్దీ రెండు వర్గాలుగా విడిపోయారు. 

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేది!

రాష్ట్ర రాజకీయాలలో బొత్స సత్యనారాయణ కీలక నేతగా ఎదిగారు. మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా ప్రయాణం సాగించి ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్నారు.  కోలగట్ల మాత్రం ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు. విజయనగరం జిల్లాలో బొత్స, కోలగట్ల వర్గాల మధ్య  ఒకానొక సమయంలో  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. జిల్లా కేంద్రంలో వేర్వేరు పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టి రాజకీయ వేడిని రగిలించేవారు నేతలిద్దరు. 

వైసీపీలో బొత్స రాకను అడ్డుకునేందుకు కోలగట్ల యత్నం!

జిల్లాలో మొదటిగా వైసీపీ తీర్థం తీసుకున్న కోలగట్ల ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఆపై బొత్స పార్టీలోకి వస్తుంటే.. ఆయన రాకను అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఒకానొక సమయంలో పదవులకి సైతం రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారట. అలా ఉప్పు-నిప్పుగా ఉన్న నాయకులు ఇప్పుడు చెట్టపట్టాలేసుకుని జిల్లాలో తెగ తిరిగేస్తున్నారు. ఏ చిన్న విషయమైనా కలిసి చర్చించుకుని.. 'చంటీ.. ఏం చేద్దాం?' అని బొత్స అంటుంటే.. 'నీకు తెలియదా బొత్స' అని కోలగట్ల బదులిస్తున్నారట. జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలకు సైతం ఇద్దరూ హాజరై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

అధిష్ఠానం సూచనలతోనే కలిసి పనిచేస్తున్నారా? 

పాత గొడవలు మర్చిపోయి.. మళ్లీ దోస్త్‌ మేరా దోస్త్‌ అంటోన్న బొత్స, కోలగట్లను చూసి పార్టీ వర్గాలే కాదు.. జనం సైతం ఆశ్చర్యపోతున్నారట. మనస్పర్థలను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి అధిష్ఠానం సూచనలే కారణమనే టాక్‌ నడుస్తోంది. జిల్లా నాయకులు ఒకే మాటపై ఉండి పనిచేయాలని.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టొద్దని పార్టీ పెద్దలు స్పష్టంగా ఆదేశించారట. అప్పటి నుంచి విజయనగరం పట్టణ రాజకీయాలను బొత్స వదిలేసినట్లు పార్టీ వర్గాల టాక్‌. విజయనగరంలోని  వ్యవహారాలన్నీ కోలగట్ల ఒక్కరే ఒంటి చేత్తో చక్కబెట్టుకు వస్తున్నారట. ఈ క్రమంలో ఇరువురు అనుచరులను సైతం కట్టడి చేశారట. వీరిద్దరూ ఇలా కలిసి ఉంటే మాకెంతో హాయి అని అనుకుంటోందట పార్టీ కేడర్‌. మరి.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని నిజం చేస్తారో.. లేక కొత్త చరిత్ర రాస్తారో చూడాలి.