బీజేపీలో పవన్‌ జపం డోస్‌ ఎందుకు పెరిగింది?

బీజేపీలో పవన్‌ జపం డోస్‌ ఎందుకు పెరిగింది?

బీజేపీలో పవన్‌ జపం డోస్‌ ఎందుకు పెరిగింది? మాజీ సీఎస్‌ రత్నప్రభ బరిలో ఉండగా.. పవన్‌ను ఓ రేంజ్‌లో కీర్తించడం వెనక కారణం ఏంటి? తిరుపతిలో పవన్‌నే అజెండాగా ఎందుకు మార్చుతున్నారు? సోము వీర్రాజు టీమ్‌ మొదలు పెట్టిన కొత్త వ్యూహం కేవలం ప్రచారమేనా? ప్రభావం కూడా చూపుతుందా? 

బీజేపీ పూర్తిగా జనసేనవైపే చూస్తోందా? 

ఏపీ బీజేపీ పూర్తిగా ప‌వ‌న్ నామ స్మర‌ణలోకి వెళ్లిపోయింది. లోకసభ ఉపపోరు తొలినాళ్లలో చేసిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు వ్యూహాలు అమ‌లు చేస్తోంది. జ‌రిగేది ఉపఎన్నికా లేక.. జనరల్‌ ఎలక్షనా అన్నట్టుగా ప్రకటనలు ఉంటున్నాయి. బీజేపీ బ‌లం ఏంటో చూపిస్తాం అని నిన్న మొన్నటి వ‌ర‌కు చెబుతూ వ‌చ్చిన క‌మ‌ల‌నాథులు ఇప్పుడు పూర్తిగా జ‌నసేన వైపు చూస్తున్నారు. పోటీలో ఉన్నది ఉమ్మడి అభ్యర్థి అయినా.. బాధ్యత జ‌న‌సేనదే అన్నస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారు.

పవనే రాష్ట్రానికి అధిపతి అని వీర్రాజు ప్రకటన!

కొద్దిరోజుల క్రితం ఏపీలో బీసీ సీఎం అని సోమువీర్రాజు ఓ ప్రక‌ట‌న చేశారు. దానిపై దూమారం రేగ‌డంతో త‌న వ్యాఖ్యల అర్థం అది కాదని నాలిక మడతపెట్టారు. స‌డెన్‌గా తిరుప‌తి ప్రచారంలో ప‌వ‌న్ పేరును ప్రధానంగా తెర‌పైకి తెచ్చారు వీర్రాజు. రాష్ట్రానికి అధిపతిగా ప‌వ‌న్ ఉండాలన్నది త‌మ అభిమ‌తంగా ఆయన చెప్పారు. సీఎం క్యాండిడేట్‌ పవన్‌ కల్యాణ్‌ అనడంలో ఎటువంటి అనుమానం లేద‌ని ఎంపీ జీవిఎల్ కూడా స్పష్టం చేశారు. ఈ కామెంట్స్‌పై బీజేపీలో విస్తృత చర్చ జ‌ర‌గ్గా.. ఇత‌ర ప‌క్షాల నుంచి విమ‌ర్శలు వ‌చ్చిప‌డ్డాయి. 

అవసరానికి మించి పవన్‌ పేరు వాడేస్తున్నారా? 

ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఈ స్థాయిలో ప‌వ‌న్ పై ఆధార‌ప‌డ‌టం బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట. జనసేనానికి ప్రాధాన్యం ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేకున్నా.. ఎన్నికల బాధ్యతంతా ఆయనిదే అన్నట్టుగా వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయని చెబుతున్నారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ఇలా మాట్లాడుతున్నారనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తోందని ఒక వర్గం భావిస్తోందట. తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో.. పార్టీ ఏ మేరకు  ప్రభావం చూపిస్తుందో అంచనా వేయడం కష్టం. కాకపోతే అవసరానికి మించి పవన్‌ పేరు వాడేస్తున్నారన్నదే వారి అభిప్రాయమట.  ఈ వేడి మధ్యే ఏప్రిల్‌ 3న జనసేనాని ప్రచారానికి తిరుపతి వస్తున్నారు. 

ఈ ఎపిసోడ్‌ ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో? 

ఈ అంశంపై జనసేనలోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా కాషాయశిబిరం పవన్‌ జపం అందుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. రేపు ఫలితం అనుకున్నట్టు రాకపోతే బీజేపీతోపాటు జనసేన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్దతు మాత్రమే ఇచ్చాం అని జనసేన తప్పుకొనే అవకాశం ఉండదు. అందుకే ఈ ఎపిసోడ్‌ రేపటి రోజులు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్‌ కూడా ఉందట. నాదెండ్ల మనోహర్‌ లాంటి వారి రియాక్షన్‌ ఇంకోలా ఉంది.  నిన్న మొన్నటి వరకు కూటమి మనుగడపై స్పష్టత కరువైన సమయంలో బీజేపీ ఒక్కసారిగా జనసేనానిని టార్చ్‌బేరర్‌గా చూపడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. బీజేపీ వదిలిన పవన్‌ బాణం గురి దిశగా వెళ్తుందో.. గురి తప్పి కూటమిని ఇబ్బందుల్లోకి నెడుతుందో చూడాలి.