రత్నప్రభను బరిలో దించడం వెనక వ్యూహం అదేనా?

రత్నప్రభను బరిలో దించడం వెనక వ్యూహం అదేనా?

తిరుపతిలో బీజేపీ పాత ఫార్ములాను బయటకు తీసిందా? మాజీ ఐఏఎస్‌ను బరిలో దించడం వెనక వ్యూహం అదేనా? కుల సమీకరణాల లెక్కలేస్తున్నారా?  కమలనాథులు ఎత్తుగడ వర్కవుట్‌ అవుతుందా? 

కుల సమీకరణాలకు బీజేపీ ప్రాధాన్యం?

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ పేరును చివరి నిమిషంలో బీజేపీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆమెను తిరుపతి తీసుకురావడం.. బీజేపీ వేసుకున్న లెక్కలు రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తోంది. విద్యావంతుల కుటుంబం.. మాజీ సీఎస్‌ అనే కోణంలోనే  రత్నప్రభను బరిలో దించలేదని అనుకుంటున్నారు. కుల సమీకరణాలకు కూడా కమలనాథులు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. 

మాదిగ సామాజికవర్గం ఓట్లపై బీజేపీ గురి!

తిరుపతి లోక్‌సభ స్థానం ఎస్సీ నియోజకవర్గం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, కాంగ్రెస్‌ క్యాండిడేట్‌ చింతా మోహన్‌ ముగ్గురూ ఎస్సీలలో మాల సామాజికవర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మాత్రం ఎస్సీలలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ విషయాన్నే బీజేపీ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుందట. మాల సామాజిక వర్గం ఓట్లు చీలిపోయినా.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓట్లు తమకు గంపగుత్తగా పడతాయని బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఈ ఓట్లకు తోడు ఇతర సామాజికవర్గ ఓట్లు కలిసి వస్తాయని లెక్క లేసుకుంటున్నారు.

బీజేపీకి ఎన్ని వర్గాలు కలిసి వస్తాయి?

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అనుకూలంగా ఉందని.. దండోరా ఉద్యమానికి మద్దతిచ్చిందని ఆ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్‌కు బీజేపీ మద్దతిస్తోంది. దీంతో నియోజకవర్గంలో ఆ వర్గాలు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. 

1999లో తిరుపతిలో బీజేపీ ఎంపీ గెలుపు!

తిరుపతి లోక్‌సభ పరిధిలో మాల సామాజికవర్గానిదే ఆధిపత్యం.  ఇక్కడ నుంచి చింతా మోహన్‌ ఆరుసార్లు ఎంపీ అయ్యారు. మధ్యలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నెలవల సుబ్రమణ్యం సైతం అదే వర్గానికి చెందినవారు. 1999లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకటస్వామి మాత్రం మాదిగ సామాజికవర్గం నేత. ఆయన ఎంపీ అయ్యారు. నాడు ఆ ఫార్ములా సక్సెస్‌ కావడంతో అదే ప్రయోగం మళ్లీ రత్నప్రభ ద్వారా చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య 10 శాతం ఓట్ల తేడా!

తిరుపతి లోక్‌సభ పరిధిలో దాదాపు 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మాల సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ. మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య  ఏడు నుంచి పదిశాతం ఓట్ల తేడా ఉంటుందని ఒక అంచనా. ఇలాంటి లెక్కలను దగ్గర పెట్టుకుని ఎక్కాలతో కుస్తీపడుతున్నారు కమలనాథులు.  అప్పట్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఆ ఫార్ములా వర్కవుట్‌ అయింది. ఇప్పుడు టీడీపీ విడిగా బరిలో ఉంది. కాకపోతే బీజేపీకి తోడుగా జనసేన ఉంది. అందుకే ఈ దఫా కూడా తమ ప్లాన్‌ సక్సెస్‌ అవుతుందని బలంగా నమ్ముతున్నారట బీజేపీ నేతలు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.