తిరుపతి ఉపఎన్నికలో ఏపీ బీజేపీ కొత్త పుంతలు!

తిరుపతి ఉపఎన్నికలో ఏపీ బీజేపీ కొత్త పుంతలు!

పోస్టింగ్‌.. ట్యాగింగ్‌.. ఫైటింగ్‌! ప్రస్తుతం ఇదే లైన్‌లో ఏపీ బీజేపీ కొత్త పుంతలు తొక్కుతోంది. టీడీపీని టార్గెట్‌ చేస్తోంది. వివిధ సందర్భాలలో నేతలు చేసిన కామెంట్స్‌ను తవ్వి తీస్తున్నారు కమలనాథులు. ఈ ప్రయత్నం పొలిటికల్‌ అటెన్షన్‌ తీసుకొస్తుందా? లేక సోషల్‌ మీడియా స్కిట్‌లా మిగుతుందా? 

బీజేపీ ఎంచుకున్న తీరుపై చర్చ!

ఇది.. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాతి రోజు నుంచి బీజేపీ మొదలుపెట్టిన అటాక్‌. ఎప్పుడో మాట్లాడిన మాటలను తవ్వి తీసి సరికొత్తగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్‌సభలో చేసిన స్పీచ్‌కు.. అసెంబ్లీలో నాడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను జత చేశారు. చంద్రబాబు ఎలా సీఎం అయ్యారో తెలియదా అని పనబాక లక్ష్మి చేసిన మరో వీడియోనూ ట్వీటర్‌లో పెట్టారు. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమే అనుకున్నా.. బీజేపీ ఎంచుకున్న తీరే రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేస్తోంది. 

రేస్‌లో ముందు నిలిచే యత్నమా? 

తిరుపతిలో వైసీపీ, టీడీపీ, బీజేపీతోపాటు మరికొందరు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అధికారపార్టీ వైసీపీ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గాన్ని 70 క్లస్టర్లుగా చేసి 70 మంది నేతలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది టీడీపీ. దాదాపు 65 మంది టీడీపీ నేతలు లోక్‌సభ పరిధిలోనే ఉండి ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు. బీజేపీ కూడా తమ బలాన్ని బలగాన్ని మోహరించింది. అగ్రనేతలు అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. సహజంగానే రేస్‌లో ముందు నిలిచేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే పాత వీడియోలను ఈ విధంగా  బీజేపీ బయటకు తీస్తోందన్న చర్చ  జరుగుతోంది.  తామే ప్రధాన పోటీదారు అని ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చే ప్రయత్నాల్లో కమలనాథులు ఉన్నారట. వైసీపీని, టీడీపీని టార్గెట్‌ చేసి ఈ రెండు పార్టీలను తమ విమర్శల చట్రంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

బీజేపీ విమర్శలకు రియాక్ట్‌ కావొద్దని నేతలకు టీడీపీ సూచన!

ఎన్నికల్లో ఏ విషయాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకోవాలో అని రకరకాలుగా ఆలోచిస్తోంది బీజేపీ. కేవలం వైసీపీని విమర్శిస్తే సరిపోదన్న భావనలో నేతలు ఉన్నారట. తామే ప్రధాన ప్రతిపక్షం అనే భావన ప్రజల్లో కల్పించేందుకు టీడీపీని టార్గెట్‌ చేస్తున్నారనే కామెంట్స్‌ పొలిటికల్‌ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి చేసి  తిరుపతి పోరులో రాజకీయ అటెన్షన్‌ కోసం గట్టిగానే కృషి చేస్తోంది. అయితే బీజేపీ విమర్శలను సీరియస్‌గా తీసుకోవద్దని టీడీపీ అధిష్ఠానం పార్టీ నేతలకు సూచించిందట. బీజేపీ ప్రధాన పోటీదారు అనిపించేందుకు మొదలుపెట్టిన ఈ సూప్‌లో పడొద్దని.. ఎవరూ పెద్దగా రియాక్ట్‌ కావొద్దని చెప్పారట. దాంతో తెలుగుదేశం నాయకులు కూడా బీజేపీని కాదని.. వైసీపీపై గురిపెట్టారట. మరి.. తిరుపతిలో కమలనాథుల నయా స్ట్రాటజీ ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.