వైఎస్‌ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రఘునందన్‌రావు వివరణ..

వైఎస్‌ మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రఘునందన్‌రావు వివరణ..

గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి... ‘‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం.. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే.. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అంటూ రఘునందన్ వ్యాఖ్యానించారు.. ఈ పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా వస్తుందన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు.. రఘునందన్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.. అసలు గ్రేటర్‌లో బీజేపీకి ఓటు వేయవద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.. చివరకు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. ఆ మహానేతను ఎప్పుడూ తాను కించపర్చలేదని వివరణ ఇచ్చారు. 

మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నేను అనని మాటలను కావాలని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై కేసీఆర్ మాట్లాడిన మాటలను ఆ కుటుంబానికి గుర్తుచేశానని వివరణ ఇచ్చారు రఘునందన్... నేను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని, అందులో చనిపోయిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడను అన్నారు.. గతంలో తాను వైఎస్ పథకాలపై మాట్లాడిన మాటలను గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. నా మాటలు ఎవరినైనా బాధిస్తే తప్పుగా అర్థం చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేసిన రఘునందన్... వైఎస్‌ఆర్ అభిమానులు వాస్తవాలను గ్రహించాలి... ఇంతకు ముందు కేసీఆర్... వైఎస్‌ఆర్ కుటుంబంపై మాట్లాడిన మాటలను తాను గుర్తు చేశానని గ్రహించాలన్నారు.. వైఎస్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు.. కేసీఆర్‌ రాజకీయ స్వార్థాన్ని గ్రహించాలని మనవి చేశారు రఘునందన్‌రావు.