వైఎస్‌ మరణంపై రఘునందన్‌ వ్యాఖ్యలు.. మండిపడిపోతున్న వైసీపీ..

వైఎస్‌ మరణంపై రఘునందన్‌ వ్యాఖ్యలు.. మండిపడిపోతున్న వైసీపీ..

గ్రేటర్‌ ఎన్నికల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి... 11 ఏళ్ల క్రితం జరిగిన వైఎస్‌ మరణాన్ని ప్రస్తావిస్తూ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి వైసీపీ శ్రేణులు... గ్రేటర్‌ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.. ‘‘నేను సైన్స్ టీచర్ని.. ప్రకృతిని నమ్ముతాం.. వెనకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టల. నువ్వు కూడా గంతే.. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది.’’ అంటూ వైఎస్‌ మరణాన్ని ఉద్దేశించి మాట్లాడారు.. ఇక, వైఎస్‌ పరిస్థితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు రఘునందన్‌.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. రఘునందన్‌ను.. అలాగే బీజేపీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అభిమానులు, వైసీపీ శ్రేణులు. అంతేకాదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఎస్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఎవ్వరూ బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో.. రఘునందన్‌ వ్యాఖ్యలు బీజేపీ ఓటింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి... పాదయాత్రతో రాష్ట్రాన్ని మొత్తం కలియతిరిగి ఆయన... ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అపూర్వ విజయాన్ని అందించి.. సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఇప్పటి ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి.. పేదల కోసం ఆయన ఆలోచించిన తీరు... వారిగుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకునేల చేసింది.. తెలంగాణలో వైసీపీకి బలమైన క్యాడర్ లేకపోయినా.. వైఎస్ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్నా.. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను మరవకుండా నిర్వహిస్తున్నారు.. రఘునందన్‌రావు తమ నేతపై చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాగా.. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే.. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.