దుబ్బాక విజయంతో తిరుపతి ఎంపీ సీటుపై కన్నేసిన బీజేపీ నేతలు...

దుబ్బాక విజయంతో తిరుపతి ఎంపీ సీటుపై కన్నేసిన బీజేపీ నేతలు...

దుబ్బాక హీట్‌ తిరుపతికి తగిలిందా? త్వరలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై పార్టీలు దృష్టి పెట్టాయా? బీజేపీ ముందుగానే గేర్‌ వేసిందా? తిరుపతిపై కమలదళం ఆలోచన ఏంటి? లెట్స్‌ వాచ్‌!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్‌!

తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం చూస్తోన్న బీజేపీకి దుబ్బాక విజయం ఉత్సాహం తీసుకొచ్చింది. ఇదే ఊపుతో ఏపీలో త్వరలో జరగబోయే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలోనూ కన్నేశారు కమలనాథులు. తిరుపతిలో జెండా ఎగరేస్తే.. అది 2024 ఎన్నికలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని కమలనాథుల లెక్కలు వేసుకుంటున్నారట. 

తిరుపతిలో సత్తాచాటి ఏపీలో బలపడేందుకు బీజేపీ వ్యూహం!

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇది ఎస్సీ రిజర్డ్వ్‌ నియోజకవర్గం. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో లోక్‌సభ పరిధి ఉంది. గతంలో ఒకసారి ఈ  స్థానంలో బీజేపీ ఎంపీ గెలిచారు. తర్వాత పోటీ ఇచ్చింది లేదు. గత రెండు ఎన్నికల్లోనూ తిరుపతి లోక్‌సభలో వైసీపీదే హవా. 2014లో వరప్రసాద్‌ ఎంపీ అయ్యారు. ఇప్పుడాయన నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో గూడురు ఎమ్మెల్యేగా పనిచేసిన దుర్గాప్రసాద్‌ 2019లో తిరుపతి ఎంపీ అయ్యారు. ఏపీలో బలపడాలని చూస్తోన్న బీజేపీకి.. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ స్థానం ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. 

తిరుపతిలో బీజేపీ ఉపఎన్నిక సన్నాహాలు!

అలా దుబ్బాకలో గెలిచారో లేదో.. ఇలా తిరుపతిలో వాలిపోయారు బీజేపీ నాయకులు. దుబ్బాకలో గెలిచిన రఘునందన్‌రావు మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చి వెళ్లారు. ఆయన అలా రాగానే.. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ సునీల్‌ దేవదర్‌ ఇలా టెంపుల్‌ సిటీకి వచ్చేశారు. కార్యకర్తలతో మీటింగ్‌ పెట్టేశారు. 

అభ్యర్థి తేలకపోయినా గ్రౌండ్‌ లెవల్లో చేయాల్సిన వర్క్‌పై ఫోకస్‌!

తిరుపతి లోక్‌సభకు జరిగే ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని.. జనసేన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పార్టీ నాయకులు. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు  ఎన్నికల బాధ్యతలు అప్పగించేందుకు ప్లాన్‌ సిద్ధం చేశారట. గడప గడపకు బీజేపీ.. ఇంటింటికీ బీజేపీ వంటి కార్యక్రమాలతోపాటు గుండెగుండెకు బీజేపీ నినాదంతో శ్రేణులు కదలాలన్నది పార్టీ నేతల ఆదేశంగా ఉందట.  అభ్యర్థి ఎవరో ఇంకా స్పష్టత లేకపోయినా.. పార్టీ పరంగా గ్రౌండ్‌ లెవల్లో చేయాల్సిన వర్క్‌పై పార్టీ పెద్దలు ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు చర్చల్లో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

తొలుత తిరుపతి బరిలో ఉండబోమన్న టీడీపీ తర్వాత మనసుమార్చుకుంది. ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు చంద్రబాబు. అభ్యర్థి వేటలోనూ పడ్డారు. వర్ల రామయ్య పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. వైసీపీ నుంచి అభ్యర్థి ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.  టికెట్‌ ఆశిస్తున్న పలువురు నాయకులు ఇప్పటికే సీఎం జగన్‌ను కలిసి విన్నవించారట. అలాగే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకుల పేర్లనూ వైసీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. పైగా వైసీపీ స్థానికంగా బలంగా ఉందనేది ఆ పార్టీ నాయకులు చెప్పేమాట. మరి.. ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ  ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.