పాలమూరు జిల్లా బీజేపీలో మళ్లీ కలకలం...!

పాలమూరు జిల్లా బీజేపీలో మళ్లీ కలకలం...!

నేతల మధ్య ఆధిపత్యపోరుతో అప్పట్లో జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెనక్కి తగ్గారు ఆ మాజీ ఎమ్మెల్యే. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మళ్లీ పదవి వీడేందుకు సిద్ధ పడుతున్నారట. హేమాహేమీలు చేరికతో భవిష్యత్‌ అంతా పూలబాటే అని నాయకులు భావించినా.. రోజు రోజుకు ముదురుతున్న ముసలం ఎవరికీ మింగుడుపడటం లేదట. 

జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని చెప్పిన ఎర్రశేఖర్‌!

పాలమూరు జిల్లా కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి. జిల్లాలో చక్రంతిప్పిన రాజకీయ ఉద్దండులకు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కాషాయ కండువాలు కప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందని బీజేపీ వర్గాలు భావించాయి. కానీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి గత డిసెంబర్‌లో తొలిసారి మహబూబ్‌నగర్‌ వచ్చారు. ఆ పర్యటన చేపట్టిన క్రమంలో.. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు ఎర్ర శేఖర్‌. పార్టీ పెద్దల బుజ్జగింపుతో ఆ రోజు సాయంత్రానికే ఆయన నిర్ణయం మార్చుకున్నారు. కానీ.. అప్పటి నుంచీ అంటి ముట్టనట్టే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేసీ సిద్ధమవుతున్న సమయంలో.. జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని ఎర్ర శేఖర్‌ చెప్పేశారట. 

వివక్ష చూపిస్తున్నారని ఎర్ర శేఖర్‌ ఆవేదన!

పాత, కొత్త నేతల మధ్య సయోధ్య లోపించడమే ఈ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు కమలనాథులు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు కాషాయ శిబిరంలో ఇమడలేక పోతున్నారనేది ఇంటర్నల్ టాక్. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది ఆగస్టులో బీజేపీలో చేరారు ఎర్ర శేఖర్. కీలక పదవుల్లో ఉన్న నేతల ఆశీస్సులతో ఆయన జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం పార్టీలోని పాత నేతలకు రుచించలేదట. వారంతా ఎర్ర శేఖర్‌కు సహయ నిరాకరణ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పాత, కొత్త నేతలకు పడటం లేదని చెబుతున్నారు. పాత నేతలు ఆమోదిస్తేకానీ.. ఏ కార్యక్రమం చేపట్టలేని పరిస్థితి ఉండటంతో పదవికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారట ఎర్ర శేఖర్‌. పైగా తనపట్ల చాలా వివక్ష కొనసాగుతుందనే ఆవేదన బలంగా ఉందట. బీజేపీలోని పాత టీమంతా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి చెంతన చేరి పొమ్మన లేక పొగపెడుతోందని ఎర్ర శేఖర్‌ అనుమానిస్తోందట. 

పదవి నుంచి తప్పుకొంటారా.. బీజేపీని వీడతారా? 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న రామచంద్రరావు గెలుపుకోసం బీజేపీ వ్యూహ రచన చేస్తుంటే.. ఎర్ర శేఖర్‌ మాత్రం లైట్‌ తీసుకుని హైదరాబాద్‌కే  పరిమితమయ్యారట. ఈ పరిణామాలపై మరో వాదన కూడా వినిపిస్తోంది. గతంలో నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డిల విషయంలో  ఏం జరిగిందో ప్రస్తుత జిల్లా అధ్యక్షునిపట్ల అదే జరుగుతోందని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకొంటారో.. లేక బీజేపీనే వీడతారో కానీ కీలక సమయంలో సందిగ్ధత కొనసాగుతోంది. మరి కమలనాథులు సమస్య తెలుసుకుని పరిష్కరిస్తారో.. కొత్త అధ్యక్షుడిని నియమిస్తారో చూడాలి.