చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి

చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెల్లని రూపాయి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పనిచేయడంలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో తన దుకాణాన్ని అమరావతి నుంచి ఢిల్లీకి మార్చి ఈవీఎంల పేరుతో డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలా చెల్లుతుందుని ప్రశ్నించారు. 

టీడీపీ కి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న చంద్రబాబు.. ఒకవేళ తమ పార్టీకి ఓట్లు రాకపోతే ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు చంద్రబాబు ఒప్పకుంటారా అని సవాల్‌ చేశారు. రూ.5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని కొందరు తన వద్దకు వచ్చారని చం‍ద్రబాబు చెబుతున్నారు.. అంటే ఆయన కార్యాలయం ఏమైనా దొంగలకు అడ్డనా.. చంద్రబాబు చెప్పాలన్నారు. ఈదేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ నేతలు మాత్రమే అన్నారు.

ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారన్నారు. ఈవీఎంలు,ఐటీ గ్రిడ్ చోర్ లకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని..ఈ విషయంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహంతి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. వ్యవస్థలో పని చేసే ఏ ఒక్క అధికారిని చంద్రబాబు గౌరవించరని ఆరోపించారు. 2014 ఎన్నికల్లో డీజీపీ తప్పించాలని లేఖ రాసి మార్పించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు డీజీపీని మారిస్తే ఎందుకు విమర్శలు చేస్తున్నారని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు.