మూడు రాజ‌ధానుల‌పై రాంమాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

మూడు రాజ‌ధానుల‌పై రాంమాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

ఏపీలో మూడు రాజ‌ధానుల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమాధ‌వ్‌.. విజ‌య‌వాడ‌లో ఏపీ బీజేపీ చీఫ్‌గా సోమువీర్రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. మూడు రాజధానుల‌పై ప్రభుత్వం నిర్ణయానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు.. దీంతో.. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయ‌న్నారు. విభజన తరువాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని చెప్పామ‌ని.. చంద్రబాబు అమరావతి రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం అభ్యంతరం చెప్ప‌లేద‌న్న ఆయ‌న‌.. నిధులు కేటాయించి ప్రోత్సహించాం.. యూనివర్సిటీలు పెట్టామ‌ని గుర్తుచేశారు.  ఇప్పుడు మూడు రాజధానులు అంటే... కేంద్రం జోక్యం చాలా పరిమితంగా ఉంటుంద‌న్నారు రాంమాధ‌వ్.. ఒక రాజధాని నిర్మాణంలో‌ అవినీతిని బిజెపి ప్రశ్నించింది.. మూడు రాజధానుల పేరుతో మళ్లీ‌ అవినీతి చేస్తే బీజేపీ పోరాటం చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్ నే ఓ జోక్ గా కొట్టిపారేశారు రాంమాధ‌వ్‌.. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కి ఒక్క‌టే రాజధాని అయినప్పుడు.. ఇక్కడ మాత్రం మూడు ఎందుకు.. ఇది కేవలం అవినీతికి అవకాశం ఇవ్వడానికే అని వ్యాఖ్యానించారు. ఎక్కడా లేనట్లు నామినేషన్ల పర్వంలోనే దౌర్జన్యాలు జరిగిన రాష్ట్రం ఇదే.. ఈసారి మాత్రం మీరు అలాంటి దౌర్జన్యాలను తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మరో మాట కూడా చెప్పారు.. ప్రతి దానికి ఢిల్లీ ఏదో చేయాలని ఎదురు చూడకుండా.. మీరే రాష్ట్రంలో గట్టిగా పోరాడాలి.. వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. అయితే అమరావతి రైతులు, ప్రజలకు పూర్తి గా న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద‌న్నారు రాంమాధ‌వ్... ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచిచూద్దాం అన్నారు. అయితే.. మూడు రాజ‌ధానుల‌పై  బీజేపీ ఏపీ నేతలది ఓ స్వరం.. జీవీఎల్, సోము వీర్రాజు బృందానిది మరో స్వరం.. ఇప్పుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మరో స్వ‌రంలా ఉంది ప‌రిస్థితి.