దిగ్విజయ్ సింగ్ పై పోటీకి బీజేపీ అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్

దిగ్విజయ్ సింగ్ పై పోటీకి బీజేపీ అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్

బీజేపీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ పై పోటీకి నిలిపింది కమలం పార్టీ. బీజేపీ కొత్త లిస్టులో నలుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కాకుండా సాగర్ నుంచి రాజ్ బహదూర్ సింగ్, గుణ నుంచి డాక్టర్ కే పీ యాదవ్, విదిశ నుంచి రమాకాంత్ భార్గవ్ లను బీజేపీ టికెట్లు లభించాయి. విదిశ నుంచి సిట్టింగ్ ఎంపీ సుష్మా స్వరాజ్ పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. 

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సింగ్ బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ కార్యాలయానికి ఆమె చేరుకోగానే ఆమెకి టికెట్ ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. మాలేగావ్ బ్లాస్ట్ కేసు కారణంగా వార్తల్లో నిలిచిన హిందూ కార్యకర్తగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చర్చల్లో నిలిచింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ లోని ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి ఆమె ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీలలో ఎంతో కాలం పని చేశారు. తర్వాత సన్యాసం స్వీకరించారు. సాధ్వీ 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలు.