వకీల్ సాబ్ కి తిరుపతి ఎన్నికలకు సంబంధమేంటి?

వకీల్ సాబ్ కి తిరుపతి ఎన్నికలకు సంబంధమేంటి?

వైసీపీ మెజారిటీపై లెక్కలేస్తుంటే, బిజెపి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ పోరులో వకీల్‌ సాబ్‌ సినిమా కూడా భాగమైంది. పవర్‌ స్టార్‌ సినిమా హిట్టయితే తిరుపతి ఫలితం బిజెపికి అనుకూలంగా వస్తుందని కమలం నేతలు భావిస్తున్నారట. ఈ మూవీకి, తిరుపతి ఎన్నికకు సంబంధం ఏంటి?

తిరుపతి ఉపపోరు ప్రచారంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు... ఓవైపు ప్రచారాలతో హోరెత్తిస్తూనే, మరోవైపు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే మిత్రపక్షమైన పవన్ కల్యాణ్ సిఎం అభ్యర్థి అంటూ ప్రకటించి ఎన్నికల బాధ్యతను జనసైనికుల భుజాన వేసిన బిజెపి, ఇప్పుడు పవన్‌ సినిమాపై ఆశలు పెట్టుకుంది.  ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. అంటే ఆ తర్వాత సరిగ్గా వారానికి ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయకపోయినా.. జనసేన మద్దతుతో బీజేపీ బరిలో ఉంది. బీజేపీ తరుపున మాజీ ఐఎఎస్ రత్న ప్రభ, వైసీపీ తరపున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరపున మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. అయితే ఇటీవల పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపించింది.

అధికార పార్టీ నేతలు ఇప్పుడు కేవలం మెజార్టీనే లెక్క వేసుకుంటున్నారు. నాలుగు లక్షలపైగా మెజారిటీతో నెగ్గడమే లక్ష్యంగా వైసీపీ బరిలో దిగుతోంది. కానీ, ఈ అంచనాలన్నిటినీ వకీల్ సాబ్ మార్చేస్తుందని బిజెపి నేతలు కొండంత నమ్మకం పెట్టుకుంటున్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో హీరోల చిత్రాలు మ్యాజిక్ చేసిన సందర్భాలు ఉన్నాయంటున్నారు బిజెపి నేతలు. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ గాలి వీచింది. అయితే తెలుగునాట మాత్రం ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. అయితే టీడీపీ అంతటి ఘన విజయం వెనుక సినిమాల ప్రభావం ఉందన్నమాట వాస్తవమే. 

ఇక బాలకృష్ణ ఎంతో ఓపికగా 2009లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. అయితే అంతకు ముందు తెలుగుదేశం సాధించిన సీట్ల కంటే రెట్టింపు సంఖ్య పెరిగింది. ఆ వెంటనే వచ్చిన సింహా సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇలా ఎన్నికల ముందు వచ్చిన సినిమా విజయాలు ఎంతో కొంత పార్టీలకు ఓట్లు పడేలా చేశాయనే అభిప్రాయాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లోను, ఇటీవల స్థానిక సంస్థ ఎన్నికల్లోనూ ఇక్కడ జనసేన కొంత ప్రభావం చూపినప్పటికీ పవన్ అభిమానులు ఇంకా నిరాశలోనే ఉన్నారు.   ఇలాంటి సమయంలో వస్తున్న తొలి సినిమా వకీల్ సాబ్.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు అన్ని పాజిటివ్ బజ్ తెచ్చాయి. కచ్చితంగా వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ అభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. పవన్ అభిమానులు రెట్టించిన ఉత్సాహంలో తిరుపతి ఉప ఎన్నికలో పని చేస్తారని... ఆ ఉత్సాహమే తమని గెలుపిస్తుందని బీజేపీ నేతలు సైతం భారీగానే ఆశలు పెట్టుకున్నారట. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ ని సిఎం గా ప్రకటించి జనసైనికుల్లో జోష్ నింపిన బిజెపి... ఇప్పుడు వకీల్ సాబ్ హిట్టయితే మరింత కలిసొస్తుందనే లెక్కలు వెసుకోంటోంది.