టెన్షన్‌ పెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. మరో మూడు రాష్ట్రాలకు పాకింది..

టెన్షన్‌ పెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. మరో మూడు రాష్ట్రాలకు పాకింది..

దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ భయం.. ఎక్కువవుతోంది. వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలను తాకిన ఈ వైరస్‌.. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లోనూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా సోకిన రాష్ట్రాల సంఖ్య పదికి చేరింది. అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు విధించొద్దని రాష్ట్రాలకు కేంద్ర పశుసంవర్థక, మత్స్య శాఖ స్పష్టం చేసింది. మానవులకు బర్డ్‌ఫ్లూ సోకుతుందనేదానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని .. ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదని తెలిపింది. బయటి నుంచి వచ్చే చికెన్‌ను నిషేధిస్తున్నామని ఢిల్లీ సర్కార్‌ ప్రకటించడంతో.. కేంద్రం ఈ ప్రకటన చేసింది. అటు, ఘాజీపూర్‌లోని పౌల్ట్రీ మార్కెట్‌ను కూడా 10రోజుల పాటు మూసేసింది ఢిల్లీ ప్రభుత్వం. 

మహారాష్ట్రలోని పర్భణీ, ముంబయి, ఠాణె, బీడ్‌, దపోలి ప్రాంతంలో చనిపోయిన పక్షుల మరణానికి బర్డ్‌ఫ్లూయే కారణమని తేలింది. ఈ విషయాన్ని భోపాల్‌ ప్రయోగశాల ధ్రువీకరించింది. అటు, ఉత్తరాఖండ్‌నూ బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. దెహ్రాదూన్‌, రిషికేశ్‌లో దాదాపు 200కు పైగా రకాల పక్షులు చనిపోయాయి. వీటి నమూనాలను ప్రయోగశాలకు పంపారు. ఇటు, తెలుగు రాష్ట్రాలనూ బర్డ్‌ ఫ్లూ భయం వెంటాడుతోంది. అయితే, దీనివల్ల మనుషులకు ఎలాంటి నష్టం జరగలేదని.. ప్రజలెవరూ భయపడాల్సిన పన్లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇక, బర్డ్‌ఫ్లూ ప్రభావం చికెన్ అమ్మకాలు, ధరలపై కూడా పడింది... చికెన్ అమ్మకాలు పడిపోగా.. ధరలు కూడా తగ్గుతున్నాయి.