వేడెక్కిన బీహార్‌ రాజకీయం

వేడెక్కిన బీహార్‌ రాజకీయం

బీహార్‌ రాజకీయం వేడెక్కింది. ఎలక్షన్లు దగ్గర పడే కొద్ది  వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇటు మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మరో వైపు LJP చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ మోడీపై చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు రసవత్తర మలుపులు తిరుగుతున్నాయి. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను వీడి ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన  లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చిరాగ్‌ వ్యాఖ్యలు చేయడంపై విమర్శిస్తున్నారు. తన ప్రచారంలో ప్రధాని మోడీ ఫోటోను వాడవద్దని కొందరు బీజేపీ నేతలు హెచ్చరించారు. వారి వ్యాఖ్యలపై చిరాగ్‌ విభిన్నంగా స్పందించారు. తన గుండెను కోస్తే మోడీ కనిపిస్తారని అన్నారు.  

మోడీ ఫోటోలు తనకు అవసరం లేదని.. ఆయన తన గుండెల్లో ఉన్నారని చెప్పారు. రాముడి పట్ల హనుమంతుడి భక్తి ఎలాగో తనకు మోడీపై అభిమానం అలానేనని అన్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్, ఆర్జెడి, వామపక్ష పార్టీలు మహా కూటమి భాగస్వామ్య పార్టీలు  తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. యువత ఉద్యోగాల కల్పనను కూడా ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రస్తావించింది ఈ కూటమి. మరోవైపు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 23న ప్రారంభించనున్నారు. అదేరోజు రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు. భూమిహార్ ఓటు బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి పెడుతోంది.  తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ సంయుక్తంగా  ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.