శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమైనదే..?

శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమైనదే..?

రాజస్థాన్ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయస్ అయ్యర్ నొప్పితో బాధపడుతున్నాడని ఆ జట్టు తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ తెలిపాడు. రాయల్స్ పై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది.ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో బంతిని ఆపే క్రమంలో ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతి భుజానికి ఒత్తుకుపోవడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో సూచనల మేరకు మైదానం వీడాడు. దాంతో శిఖర్ ధావన్ తాత్కలిక సారథిగా జట్టును ముందుండి నడిపించాడు.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. అయ్యర్ గాయం తీవ్రతపై ఇప్పుడేం చెప్పలేం అన్నాడు. తదుపరి పరీక్షల తర్వాతనే అతని పరిస్థితి తెలుస్తుందని, ప్రస్తుతానికైతే అతని భుజం కదులుతుందన్నాడు. ఇక రాజస్థాన్‌పై గెలవడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. వరుస విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకెళ్తున్నా మరో వైపు ఆ జట్టును గాయల బెడద వీడటం లేదు. ఇప్పటికే అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ గాయాలతోనే టోర్నీ నుంచి తప్పుకున్నారు. ప్రారంభ మ్యాచ్‌లోనే గాయపడ్డ అశ్విన్.. కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. రిషభ్ పంత్ కూడా గాయపడి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరో రెండు మ్యాచ్‌ల వరకు అతను జట్టులోకి వచ్చే అవకాశం లేదు. తాజాగా అయ్యర్ కూడా గాయపడటం ఆ జట్టును కలవరపెడుతుంది.