ఎమ్మెల్యే పేరుతో భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, పోలీసులు కూడా ?

ఎమ్మెల్యే పేరుతో భూకబ్జాలు, సెటిల్ మెంట్లు, పోలీసులు కూడా ?

ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అంతా ఆ ఎమ్మెల్యే పేరును తెగ వాడేస్తున్నారట. అదీ చిన్న చిన్న పనుల్లో కాదు. కోట్లు విలువ చేసే భూములు కొట్టేయడానికి ఎమ్మెల్యే పేరు వాడేసుకుంటున్నారట. విషయం ఆయన దాకా వెళ్లింది. ఈ దందాలు తన కొంప ముంచుతాయని బెంబేలెత్తిన సదరు ఎమ్మెల్యే అలాంటి వాటికి తన పేరు వాడితే ఖబర్దార్‌ అంటున్నారట. 
 
ఎమ్మెల్యే భూమన పేరు చెప్పి దందా చేస్తున్నారా? 

భూ దందాల జాబితాలో తిరుపతి కూడా చేరింది. ల్యాండ్‌ సెటిల్మెంట్లు.. భూ కబ్జాలకు కొదవే లేదు.  జీవకోనతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి అయిన మంగళం ప్రాంతంలో సామాన్యులను బెదిరించి ఇటీవల కొందరు భూములు స్వాధీనం చేసుకుంటున్నారట. కోర్లగుంట సమీపంలో ఓ డాక్టర్‌కు సంబంధించిన ఇంటి వివాదంలో పోలీస్‌స్టేషన్‌ వరకూ వెళ్లింది. ఇలాంటివి అన్ని చోట్లా ఉండేవైనా.. తిరుపతి పరిసరాల్లో జరుగుతున్న ఈ యవ్వారాలు మాత్రం స్పెషల్‌. స్థానిక ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌రెడ్డి పేరు చెప్పి ఎవరి స్థాయిలో వారు దందా చేస్తున్నారట. ఈ గొడవలే తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. 
 
సొంత పార్టీ నేతలు.. టీడీపీ వాళ్లూ భూమన పేరు వాడేసుకుంటున్నారా?

ప్రస్తుతం ఓ రేంజ్‌లో సాగుతున్న భూ దందాలు.. అందులో తన పేరు వాడుకోవడంపై  భూమన ఉలిక్కి పడుతున్నారట. సొంత పార్టీ నేతలు.. బయటి వ్యక్తులు.. చివరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ఈ జాబితాలో ఉన్నారట. వీటిపై రోజూ ఎమ్మెల్యేకు ఫిర్యాదు అందుతున్నట్లు సమాచారం. ఇదేదో మొదటికే మోసం వచ్చేలా ఉందని భావించిన ఆయన.. భూ దందాలకు పాల్పడేది ఎవరో అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం. ఆ క్రమంలోనే సొంత పార్టీవారి పేర్లు, టీడీపీ నేతల పేర్లు బయటకు వచ్చాయట. దాదాపు ఆరు నెలలుగా వారంతా భూ దందాల్లో ఉన్నట్లు తెలుసుకున్నారట. 
 
దందాలకు పాల్పడుతున్న వారికి ఎమ్మెల్యే వార్నింగ్‌!

పార్టీ అధికారంలో ఉండటం.. ఎమ్మెల్యేకు తెలిసినా ఏమీ అనరులే అన్న ధీమాతో వైసీపీ నేతలు ఈ ఆరు నెలలుగా భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో చెలరేగిపోయారట. ఇక లాభం లేదనుకున్న ఎమ్మెల్యే భూమన.. దందాలకు పాల్పడుతున్న సొంత పార్టీ నేతలను పిలిచి వార్నింగ్ ఇచ్చారట. టీడీపీ నేతలకు తన అనుచరుల ద్వారా  హెచ్చరించి వదిలిపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఎవరైనా సరే ఇంకోసారి ఇలాంటి వాటికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట. 
 
పోలీసులు ఎమ్మెల్యే పేరు వాడేసుకుంటున్నారా? 

ఈ భూ దందాలకు సాయపడిన వారిలో  రెండు పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. సమస్య ఏదైనా స్టేషన్‌కు వెళ్తే పోలీసులు క్షణాల్లో సెటిల్ చేస్తున్నారట. ఇక్కడ కూడా పోలీసులు ఎమ్మెల్యే భూమన పేరే వాడేసుకుంటున్నారట. ఈ విషయాన్ని కూడా పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారట కరుణాకర్‌రెడ్డి.  భూ దందాలకు సాయపడిన పోలీసులపై త్వరలో వేటు పడుతుందని అనుకుంటున్నారు. ఎవరైన ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తే నేరుగా ఇంటికొచ్చి చెప్పాలంటున్నారట భూమన. మరి.. ఈ వార్నింగ్‌లతో  తిరుపతిలో భూ దందాలకు అడ్డు పడుతుందో లేదో చూడాలి.