ఐఏఎఫ్‌ తొలి మహిళా ఫైటర్ పైలెట్, యుద్ధానికి సిద్ధం

ఐఏఎఫ్‌ తొలి మహిళా ఫైటర్ పైలెట్, యుద్ధానికి సిద్ధం

భారత వాయుసేనలో మొట్టమొదటి ఫైటర్ పైలెట్ యుద్ధానికి సిద్ధమైంది. ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ శిక్షణలో ఒక దశ పూర్తయింది. ఇప్పుడు ఆమె డే ఆప్స్ గా చెప్పే పగటి యుద్ధానికి సిద్ధమైంది. ఇంకా ఆమె రాత్రి సమయాల్లో ఫైటర్ పైలెట్ గా శిక్షణ పొందాల్సి ఉంది. ఆ తర్వాత భావన పూర్తి స్థాయిలో ఆపరేషనల్ అవుతుంది. అంటే పగలైనా రాత్రయినా ఏ సమయంలోనైనా యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటుంది. 

ఫ్లైట్ లెఫ్టినెంట్ భావనా కాంత్ రాజస్థాన్ దగ్గర ఉన్న నాల్ లోని ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ బేస్ లో 3-స్క్వాడ్రన్ లో ఉన్నారు. ఆమె మిగ్-21 బైసన్ ఫైటర్ పైలెట్. ఇప్పుడు ఫ్లైట్ లెఫ్టినెంట్ అవని చతుర్వేది, మోహనా సింగ్ ల శిక్షణ నడుస్తోంది. అవని చతుర్వేది ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపే మొదటి ఫైటర్ పైలెట్ గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత భావనా కాంత్ తనొక్కతే ఫైటర్ జెట్ నడిపారు. ఫైటర్ పైలెట్ అయ్యేందుకు వివిధ దశల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ముందుగా ఒంటరిగా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తారు. ఇందులో యుద్ధ పరిస్థితుల్లో ఎలా యుద్ధ విమానం నుంచి ఆయుధాలు ప్రయోగించాలో నేర్పిస్తారు.

ఆ తర్వాత పగటి వేళ ఫైటర్ జెట్లతో యుద్ధం ఎలా చేయాలో శిక్షణ ఉంటుంది.  ఆ తర్వాత ఫైటర్ పైలెట్ కు డే ఆప్స్ అంటే పగటి వేళ ఆపరేషనల్ అయ్యేందుకు అనుమతి ఇస్తారు. భావనా కాంత్ ఈ శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె పగటి వేళ యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధ విమానంతో శత్రువులపై దాడి చేయగలదు. ఇంకా ఆమె మూన్ ఫేజ్, డార్క్ ఫేజ్ శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది. అంటే వెన్నెల రాత్రుల్లో ఎలా యుద్ధ విమానాలు నడపాలి, చిమ్మచీకట్లో ఎలా నడపాలో నేర్పిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక ఆమెను పూర్తిస్థాయిలో ఆపరేషనల్ గా గుర్తిస్తారు. అప్పుడామె ఎలాంటి పరిస్థితుల్లోనైనా శత్రువులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న పూర్తిస్థాయి ఎయిర్ ఫోర్స్ పైలెట్ అవుతారు.