అరవై ఏళ్ళ 'భక్త జయదేవ'

అరవై ఏళ్ళ 'భక్త జయదేవ'

జయదేవుని అష్టపదులు తెలియని సంగీతప్రియులు ఉండరు. ఇక శ్రీకృష్ణభక్తులకు ఆ శృంగార కీర్తనలే భక్తి భావం పెంచుతూ ఉన్నాయి. ఈ నాటికీ జయదేవుని అష్టపదులు అందరికీ ఆనందం పంచుతూనే ఉండడం విశేషం. 'భక్త జయదేవుని' కథ ఆధారంగా రూపొందిన చిత్రానికి ప్రముఖ దర్శకుడు, భానుమతి భర్త రామకృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రానికి పి.వి.రామారావు దర్శకుడు. కొమరవోలు నారాయణ రావు, జి.పార్థసారథి రెడ్డి నిర్మాతలు. 

పరవశింప చేసిన అష్టపదులు...
'భక్త జయదేవ' చిత్రం 1961 ఏప్రిల్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి సీనియర్ సముద్రాల రచన దన్నుగా నిలచింది. ఇక సాలూరు రాజేశ్వరరావు స్వరపరచిన భక్త జయదేవుని అష్టపదులు ఆ రోజుల్లో భక్తకోటిని, సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. జయదేవుడు అంటే కేవలం కృష్ణ భక్తుడే కాదు, సంఘసంస్కర్త కూడా అని చూపించారు.  అమాయకులైన అందమైన అమ్మాయిలను దేవదాసీలుగా మార్చే సమాజాన్ని జయదేవుడు వ్యతిరేకించాడు. అలాంటి ఓ అమాయకురాలికి నీడనిచ్చాడు. ఈ అంశాలన్నీ ఆకట్టుకొనేలా తెరకెక్కాయి. అక్కినేని నాగేశ్వరరావు జయదేవునిగా నటించిన ఈ చిత్రంలో పద్మావతి పాత్రను అంజలీదేవి ధరించారు. మిగిలిన పాత్రల్లో రేలంగి, చిత్తూరు నాగయ్య, సీఎస్సార్, వంగర, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, సురభి కమలాబాయి, ఈ.వి.సరోజ తదితరులు నటించారు. 

జయదేవుని అష్టపదులను అనువైన చోట ఉపయోగించుకున్నారు. అవి కాకుండా "నీ మధు మురళీ గాన లీల...", "నాదు ప్రేమ భాగ్యరాశి నీవే ప్రేయసి..." , "దయ గనుమా... జగదీశా..." వంటి పాటలు కూడా పరవశింప చేశాయి.